ఫాసిజం మూలాల ధ్వంసానికి మరో ఎర్రసేన అవసరం
వివిధ రంగాలకు చెందిన వక్తలు
ప్రజాపక్షం/హైదరాబాద్ ఫాసిజం తరహాలో దేశంలో పరిపాలన సాగుతుందని వివిధ రంగాలకు చెందిన వక్తలు అన్నారు. మతోన్మాదాన్ని, మతతత్వాన్ని ప్రతిఘటించకపోతే దేశం ఫాసిజంవైపు పయనిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫాసిజం మూలాలను ధ్వంసం చేయడానికి మరో ఎర్రసేన అవసరమన్నారు. ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఫోరం (ఎఐపిఎఫ్) ఆధ్వర్యంలో కె.ఎల్.మహేంద్ర రాసిన ఫాసిజం మూలాలు పుస్తకావిష్కరణను ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, ఎఐపిఎఫ్ నాయకులు మర్ల సోమసుందర్, వీక్షణం సంపాదకులు కె.వేణు గోపాల్, రచయిత పింగలి చైతన్య, స్కైలాబ్ బాబు, ఎఐపిఎఫ్ నాయకులు అన్వర్ పాషా, ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం ఎస్.ఎన్.రెడ్డి భవన్లో మంగళవారం జరిగిన సభలో ఆవిష్కరించారు. ఆల్ ఇండియా ప్రొగ్రెసీవ్ ఫోరం నాయకులు స్టాలిన్ స్వాగతోపన్యాసం చేసి సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
దేశంలో జడలు విప్పి నాట్యం చేస్తున్న ఫాసిజం : వేణు గోపాల్
దేశంలో ఫాసిజం జడలు విప్పి నాట్యం చేస్తుందని కె.వేణు గోపాల్ అన్నారు. ఎక్కడ అధికారం, సంపద ఉంటుందో అక్కడ ఫాసిజం ఉంటుందన్నారు. ఫాసిజం మూలం హైందవ హిందూ బ్రహ్మణ సంస్కృతి అన్నారు. ఫాసిజం అసమానతల్లో ఉందని, హైందవత్వానికి ప్రేమ, కరుణ, దయలేదన్నారు. ఏకీభవించని వారి పీక నొక్కివేయడమే అనే సిద్ధాంతాన్ని కాళోజీ చెప్పినట్లుగా అనిచివేయడమే ఫాసిజం అన్నారు. విద్యలో, రాజకీయంలో మతం ఉండకూడదన్నారు. లౌకికవాదం అంటే అసమానతలు లేని సమానత్వాన్ని సూచించేదన్నారు. మతంలో రాజ్యం ఉండకూడదని, జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఫాసిజం నాలుగు పాదాల మీద నడుస్తుందని ఆర్ఎస్ఎస్ అంటే హింసా,
దోపిడి, పీడన చేసే సంస్థ అని విమర్శించారు.
ఫాసిజంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రామికవర్గం ఎస్.బాల్ రాజ్
పాసిజంతో శ్రామిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఎస్.బాల్‌రాజ్ అన్నారు. ఫాసిజం ఉన్నంతకాలం పెట్టుబడిదారి సంస్థ విధానం ఉంటుందన్నారు. ఫాసిజాన్ని అంతం చేసేందుకు సమైక్య ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాసిజాన్ని రూపుమాపేందుకు శ్రామికవర్గం కృషి చేయాలని బాల్‌రాజ్ పిలుపునిచ్చారు.
భూమిని విడిచి నీళ్లల్లో పూజలు చేస్తున్న మోడీ : పంగళి చైతన్య
మతోన్మాద భావజాలం పేరుతో ప్రధాన మంత్రి మోడీ భూమి విడిచి నీళ్లల్లో పూజలు చేస్తున్నారని రచయిత పింగళి చైతన్య అన్నారు. దేశంలో ఫాసిజం అడుగులు వేగంగా పడుతున్నాయన్నారు. ఫాసిజాన్ని అంతమొందించడానికి కార్యాచరణ అవసరమని తెలిపారు. మాట్లాడలంటే, భావవ్యక్తీకరణ చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో బయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా మాట్లాడితే దాడులు చేయటం, జైల్లో పెట్టటం జరుగుతుందన్నారు.
మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్న బిజెపి : స్కైలాబ్ బాబు
మతాన్ని రాజకీయాల కోసం బిజెపి వాడుకుంటుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. మతం వ్యక్తిగతమైనప్పటికీ ప్రజలను అజ్ఞానంలో ఉంచడానికి మతం పనిచేస్తుందన్నారు. మానవ మారణహోమాన్ని సృష్టించడానికి మతాన్ని రాజకీయాల్లో చొప్పిస్తున్నారని విమర్శించారు.
మతోన్మాద దేశంగా మార్చేందుకు బిజెపి కుట్ర : అన్వర్ పాషా
భారత్‌ను మతోన్మాద దేశంగా మార్చేందుకు బిజెపి కుట్రలు అమలు చేస్తుందని అన్వర్ పాషా అన్నారు. ఆర్ఎస్ఎస్ రూపమే ఫాసిజం రూపమని అన్నారు. హిందూ దేశంగా భారతదేశాన్ని ఎలా మార్చాలని ఆర్ఎస్ఎస్ నాయకులు హెగ్డేవార్ ఇటలీవెళ్ళి ఫాసిజాన్ని అధ్యయనం చేశారని ఆరోపించారు.
ప్రమాదంలో దేశం : మర్ల సోమసుందర్
మతతత్వాన్ని ప్రజలపై బిజెపి బలవంతంగా రుద్దుతుందని ఆల్ ఇండియా ప్రొగ్రెసీవ్ ఫోరం నాయకులు మర్ల సోమసుందర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతోన్మాద ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఆర్ఎస్ఎస్కు రాజ్యాంగంపై నమ్మకం లేదని, అందుకే జాతీయ జెండా ఎగురవేయకుండా కాషాయ జెండాను ఆర్ఎస్ఎస్ ఎగురవేస్తుందన్నారు.
ఫాసిజం నార్సిజంలా దేశంలో కొనసాగుతున్న పరిపాలన
RELATED ARTICLES