న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధతతోపాటు, ఇతరత్రా డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ‘ఢిల్లీ చలో మార్చ్’ని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు ఆదివారం సింఘు, టిక్రి సరిహద్దుల్లో బ్యారికేడ్లను తాత్కాలికంగా తొలగించారు. పాదచారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు. ఇలావుంటే, తదుపరి కార్యాచరణను ఈనెల 29న ఖరారు చేస్తామని ఎస్‌కెఎం ప్రకటించింది. కాగా, ఢిల్లీ చలో మార్చ్ తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ, సరిహద్దుల్లో పోలీసు, పారామిలటరీ బలగాల మోహరింపు 24 గంటలు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో వాహనాల కదలికు అనుమతి ఉండదని, కేవలం పాదచారులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇలావుంటే, టిక్రీ, సింఘస, ఘాజీపూర్ సరిహద్దు పాయింట్ల వద్ద మోహరించిన భద్రతా సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. మూడు సరిహద్దుల్లో మోహరించిన భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గట్టి నిఘా ఉంచాలని ఢిల్లీ పోలీసు అధికారులు కోరారు. శుక్రవారం నాడు పంజాబ్, -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు, హర్యానా పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఫలితంగా, టిక్రి, సింఘు సరిహద్దులు భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. కాంక్రీట్, ఇనుప మేకులతో ఆ ప్రాంతంలోని రోడ్లను పూర్తిగా మూసివేశారు. ఆదివారం తాత్కాలకంగా వాటిని పాక్షికంగా తొలగించడంతో పాదచారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంటర్నెట్ పునరుద్ధరణ
హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని పునరుద్ధరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేసిన విషయం విదితమే. అయితే, ఆందోళనకు ఎస్‌కెఎం విరామం ప్రకటించడంతో, ఏడు జిల్లాల్లో ఈ సౌకర్యాన్ని పునరుద్ధరించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో తాత్కాలికంగా బ్యారికేడ్ల తొలగింపు
RELATED ARTICLES