HomeNewsTelanganaముహూర్తం 27నే...

ముహూర్తం 27నే…

రూ.500కే గ్యాస్‌ సిలెండర్‌,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ గ్యారంటీలు ప్రారంభం
కార్యక్రమానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ…
రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త
సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
ప్రజాపక్షం / ములుగు ప్రతినిధి
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలెండర్‌, తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే మంచి శుభవార్త చెప్పబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 6,956 మంది స్టాఫ్‌ నర్సుల నియామకం, 441 సింగరేణి ఉద్యోగులు, 15 వేల పోలీసు, ఫైర్‌ డిపార్టుమెంట్‌ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపా రు. మార్చి 2వ తేదీన మరో 6 వేలపైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామా అల్లుళ్లు, తండ్రీకొడుకలు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు పది స్కిల్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో ప్రతి పోస్టుకు డబ్బు ఇస్తే తప్ప పోస్టులు వచ్చేవి కావనిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాము పారదర్శకంగా, సామాజిక న్యాయం పాటిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చామని తెలిపారు. సచివాలయంలోకి అందరినీ అనుమతిస్తున్నామని, గతంలో జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వలేదని, ఇప్పుడు ప్రతి ఛాంబర్‌కు వెళ్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సచివాలయానికి వెళ్లాలనుకున్న తనను, సీతక్కను గతంలో వెళ్లనివ్వలేదని ఆయన గుర్తు చేశారు.
కెసిఆర్‌ కుటుంబ దోపిడీపై బిజెపి ఎందుకు స్పందిచలేదు..
కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు చూపామని, కెసిఆర్‌ కళ్లు మూసుకొని ఫాంహౌస్‌లో ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కృష్ణా జలాలలను తరలించుకుపోయారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని రూ. ఏడు లక్షల కోట్ల అప్పులతో కెసిఆర్‌ దివాళా తీయించారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కెసిఆర్‌ పదేళ్లుగా దోపిడీకి పాల్పడుతుంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఏనాడూ ప్రధామనంత్రి నరేంద్ర మోడీ అడ్డుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై తాము జ్యుడిషియల్‌ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత దానిని సిబిఐకి అప్పగించాలని బిజెపి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు కెసిఆర్‌, కెటిఆర్‌ ఆ కుటుంబంపై కేసు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే రిటైర్డ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో సాగే విచారణను బిఆర్‌ఎస్‌ నాయకలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
త్వరలోనే ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ను నియమిస్తాం…
త్వరలోనే ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వాళ్లు ఇద్దరి (బిజెపి ఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పది సీట్లు బిజెపికి, ఏడు సీట్లు కెసిఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి విజ్హప్తి చేశారు.
సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో….
సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంచి వర్షాలు పడి పాడిపంటలతో ప్రజలు విలసిల్లాలని, తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 2023, ఫిబ్రవరి ఆరో తేదీన హాత్‌ సే హాత్‌ జోడోను ఇక్కడ నుంచే ప్రారంభించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులకు అసౌకర్యం కలగకుండా, అన్నిరకాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి చేస్తామని ఆనాడే చెప్పామని, అలానే చేశామన్నారు. సుమారు ఒక కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని, ఏర్పాట్లలో లోపం ఉండదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం రూ.110 కోట్లను జాతరకు కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడ బిడ్డలు ఉచిత బస్సులు వినియోగించుకున్నారని, జాతరకు లక్షలాది మంది మహిళలు వచ్చేందుకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడిందని ముఖ్యమంత్రి అన్నారు. దక్షణ కుంభమేళాలాంటి ఈ జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని తాము ఎన్ని సార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. దక్షణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క-సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి సందర్శించుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), టూరిజం , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ మురళి నాయక్‌, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి , జాతర ప్రత్యేక అధికారులు శరత్‌ , ఆర్వి కర్ణన్‌,జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ po అంకిత్‌,ఎస్పీ శబరిష్‌, తదితరులు ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments