కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదు
ప్రస్తుత ప్రాజెక్టు విలువ రూ.1,47,427 కోట్లు మించిపోయే అవకాశం
కాగ్ నివేదిక స్పష్టీకరణ
అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ప్రజాపక్షం / హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు చేసే ప్రతి రూపాయికీ కేవలం 52 పైసలు విలువ గల ప్రయోజనం మాత్రమే చేకూరుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ నివేదిక స్పష్టం చేసింది. పనుల వ్యయం, నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీమరింత పెరిగే అవకాశం ఉండడం, ఇంకా వ్యవసాయం, పారిశ్రామిక, తాగునీటి సరఫరా ద్వారా వాస్తవంగా ఒనగూరే ప్ర యోజనాలు, ఆదాయాలు సాగునీటి శాఖ వేసిన అంచనాల కంటే ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉన్నదని పేర్కొంది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై, పియుసిలు, స్థానిక సంస్థలు, ఆసరా పింఛన్లపై కాగ్ ఇచ్చిన నివేదికను డిప్యూటీ సిఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. ప్రాజెక్టు నిర్మాణం, రీ-ఇంజినీరింగ్, చేకూరిన ప్రయోజనాలు, నష్టాలను ఆడిట్ నివేదికలో కాగ్ సమగ్రంగా వివరించింది. కాళేశ్వరంపై కాగ్ నివేదిక ప్రకారం కేంద్ర జల సంఘానికి సమర్పించిన రూ.81,911 కోట్ల ప్రాజెక్టు విలువతో పోలిస్తే ప్రస్తుత ప్రాజెక్టు విలువ రూ.1,47,427 కోట్లను మించిపోయే అవకాశం ఉన్నదని తెలిపింది. సాగునీటిపై అయ్యే మూల ధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలుగా తేలుతుందని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్టులకు 8,459 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని, ఇది రాష్ట్రంలోని స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో దాదాపు సగం (46.82 శాతం) అని ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఏటా 14,344 మిలియన్ యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరమవుతుందని వివరించింది.
విద్యుత్, అప్పుల చెల్లింపునకే ఏటా రూ.25వేల కోట్లు
ఈ ప్రాజెక్టుకు ప్రతి ఏటా విద్యుత్ ఛార్జీల కోసం రూ.10,374 .56 కోట్లు అవసరమవుతుందని, అదనంగా వార్షిక నిర్వహణ ఖర్చు మరో రూ.272.70 కోట్లు కలిపితే ఏటా రూ.10,647.26 కోట్లుఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఎకరాకు రూ.46,364గా తేలుతోంది. ఇది కాకుండా ప్రాజెక్టు పనులపై ఏటా రూ.2,760.62 కోట్లు తరుగుదల ఉంటుంది. ప్రభుత్వం చెప్పినట్లు నీటి ఛార్జీలు, మత్స్య సంపద వంటి ఆదాయాలు తక్కువే అవుతుంది. రుణాలను తీర్చడానికి వచ్చే 14 ఏళ్ళలో ప్రభుత్వానికి మొత్తం మీద రూ.1,41,544.59 కోట్లు ఉంటుందని, అంటే ఏటా రూ.14,462 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. 2024 జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని సాగునీటి శాఖ భావిస్తున్నప్పటికీ, పనుల స్థితి, ఇంకా పూర్తిచేయాల్సిన పనులను చేస్తే సంపూర్ణ ప్రయోజనాలు పూర్తయ్యేందుకు ఇంకా చాలా ఏళ్ళు పట్టే అవకాశం ఉందని తెలిపింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ చేపట్టిన ప్రదేశంలో లోతులో నిటారుగా ఉన్న పగుళ్లు ఉన్నట్లు తేలిందని, అయినప్పటికీ భూకంప సంబంధిత లోతైన అధ్యయనాలేవీ నిర్వహించకుండా ముందుకు సాగి రూ.6,126.80 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మించారని కాగ్ తెలిపింది.
గుత్తేదారులకు అదనపు చెల్లింపులు
పంపులు, విద్యుత్ మాట్లార్లు, వాటి అనుబంధ పరికరాల నిమిత్తం రూ.17,653 కోట్లు అవుతుందని, అందులో నాలుగు పనుల్లో రూ.5,525.75 కోట్లు అధికంగా వాస్తవ ధరకంటే అధికంగా ఉన్నట్లు కాగ్ పరిశీలనతో తేలింది. ఆ నాలుగు పనులకు వాస్తవ ధర రూ.1,686.59 కోట్లు కాగా, అంచనాలలో రూ.7,212.34 కోట్లుగా పొందుపరిచారని పేర్కొంది. బిహెచ్‌ఇఎల్ పరిధిలో లేని పరికరాల, పనుల కోసం అంచనా విలువలో 30 శాతాన్ని , గుత్తేదార్ల ఇతర వ్యయాలు, లాభం కసం మరో 20 శాతానిన అనుమతించినా కూడా ఈ పనులలో గుత్తేదారులకు కనీసం రూ.2,684 కోట్ల అనుచిత లబ్ది చేకూరి ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని కాగ్ నివేదికలో తెలిపింది.
రూపాయికి 52 పైసలే…
RELATED ARTICLES