HomeNewsNationalఢిల్లీ సరిహద్దులు అష్టదిగ్బంధనం

ఢిల్లీ సరిహద్దులు అష్టదిగ్బంధనం

డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళనలు తప్పవంటున్న రైతులు
న్యూఢిల్లీ:
ఢిల్లీ సరిహద్దులను భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. అప్పటి వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబర్‌లో ప్రారంభమైన ఆందోళన సుమారు ఏడాది కొనసాగిన విషయం తెలిసిందే. సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని బైఠాయించి, ఆందోళనలు కొనసాగించారు. ఎట్టకేలకు దిగివచ్చిన మోడీ ప్రభు త్వం, ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేసినప్పటికీ, కనీస మద్దతు ధర (ఐఎస్‌పి)కి చట్టబద్ధత కల్పించడంసహా లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటి వరకూ నెరవేర్చలేదు. దీనితో విసిగిపోయిన రైతులు ‘ఛలో ఢిల్లీ మార్చ్‌’కి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనెల 13వ తేదీన ఢిల్లీకి ర్యాలీగా బయలుదేరిన పం జాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల రైతులను భద్రతా దళాలు ఎక్కడికక్కడ నిలిపివేశాయి. పంజాబ్‌ సరిహద్దుల్లో హర్యానా పోలీసులు డ్రోన్లతో రైతులపై బాష్పవాయు ప్రయోగం జరిపారు. హర్యానా రహదారిపై ఇనుప కంచెలు, బ్యారికేడ్లు ఉంచి, రైతుల వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. ఢిల్లీకి వచ్చే రహదారులపై మేకులు నాటారు. అయినప్పటికీ, వెనుదిరిగేది లేదంటున్న రైతులు, ఆందోళనను కొనసాగిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. కాగా, రైతుల ఢిల్లీ ఛలో మార్చ్‌ రెండో రోజు, బుధవారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ సరిహద్దులో ట్రాఫిక్‌ను కొద్దిపాటి ఆంక్షలతో కొనసాగిస్తున్నారు. అయితే, హర్యానాతో సింఘు, టిక్రీ సరిహద్దుల వద్ద రోడ్లను పూర్తిగా మూసివేశారు. కవాతును నిర్వహించి తీరుతామని రైతులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్‌ ఢిల్లీతోపాటు, హర్యానాతో సరిహద్దుగల వివిధ పాయింట్ల వద్ద కదలికలను నియంత్రించడానికి పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. వివిధ రూపాల్లో అడ్డంకులు సృష్టించారు. ఢిల్లీని ఘజియాబాద్‌, నోయిడా, మీరట్‌తో కలిపే జాతీయ రహదారులు -9, 24పై, పగటిపూట వాహనాల పరిమితంగా అనుమతిస్తున్నారు. అయితే, విపరీతమైన తనిఖీలు జరుగుతున్న కారణంగా, డిఎన్‌డి ఫ్లువేసహా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నోయిడా, ఢిల్లీ మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. రైతుల కవాతును అడ్డుకోవడానికి నగర సరిహద్దు పాయింట్లు – ఘాజీపూర్‌, సింఘు, టిక్రీ వద్ద అనేక లెక్కకు మించిన బారికేడ్లు, కాంక్రీట్‌ బ్లాక్లు, ఇనుప మేకులు, కంటైనర్‌ గోడలు ఉంచారు. సింఘు సరిహద్దుకు సమీపంలోని ఓ గ్రామం వద్ద రహదారిని తవ్వేశారు. ఢిల్లీ, మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎలాంటి ఆంక్షలు లేవని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, అడుగడుగునా తనిఖీలు, అడ్డంకులతో యుద్ధ వాతావరణం నెలకొంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్లు, వ్యవసాయ రుణమాఫీ, పోలీసు కేసుల ఉపసంహరించాలని, లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలని కూడా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఏ పార్టీతోనూ సంబంధం లేదు…
రైతు ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని రైతు నాయకులు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌, జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ స్పష్టం చేశారు. ఆందోళనకు పిలుపునిచ్చిన సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), ఇతర రైతు సంఘాలు, సమాఖ్యలకు వామపక్షాలకు, కాంగ్రెస్‌కు అనుకూలంగా పని చేస్తున్నాయని కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని బుధవారం మీడియాతో మాట్లాడుతూ వారు చెప్పారు. మరి కొందరు పంజాబ్‌ ప్రభుత్వం తరఫున ఆందోళన చేపట్టామంటూ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అయితే, రైతు ఆందోళనకు, వామపక్షాలు, కాంగ్రెస్‌ లేదా మరే ఇతర పార్టీకీ సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, తమ హక్కుల సాధనకు ఉద్యమిస్తున్నామని ఈ రైతు నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఘర్షణ కోసం తాము ఇక్కడికి రాలేదని వ్యాఖ్యానించారు. ‘మేము రైతుం… రైతు కూలీలం.. మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం.. ఎ లాంటి చర్చలకైనా సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయ ఉద్యమం కాదు… రైతుల ఉద్యమం’ అన్నారు.


కేంద్రంతో చర్చలకు సిద్ధం
చండీగఢ్‌:
తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రైతు నాయకులు స్పష్టం చేశా రు. కేంద్రం నుంచి చర్చలకు ఆహ్వానం వస్తే తప్పకుండా పరిశీలిస్తామని అన్నారు. అయితే, చర్చలకు సానుకూల వాతావరణం ఉండేలా చూడాలని కోరారు. రైతు నాయకులు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌, జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ వేరువేరుగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి హామీ ఇచ్చేలా చట్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అందరి ఆమోదం లేకుంతడా, ఎంఎస్‌పికి హామీ ఇచ్చే చట్టాన్ని తీసుకురావడం కుదరదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చేసిన ప్రకటనను అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడిన పంథేర్‌ ప్రస్తావించారు. తమ డిమాండ్లను పట్టించుకోకుండా, నిరసన తెలిపిన రైతులపై పోలీసు చర్యకు దిగిందంటూ కేంద్రాన్ని ఆయన విమర్శించారు. మంగళవారం వందలాది మంది రైతులు గాయపడ్డారని అన్నారు. ‘అయితే అప్పుడు కూడా చర్చలు జరపకూడదని మేము చెప్పము. కానీ ముందుగా ఈ నిర్బంధాలను ఆపాలని, సానుకూల వాతావరణం ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము నిన్న చర్చలకు సిద్ధంగా ఉన్నాము.. ఈ రోజు కూడా మేము సిద్ధంగానే ఉన్నాము‘ అన్నారు. రైతుల డిమాండ్లు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన విమర్శను పంథేర్‌ తోసిపుచ్చారు. తమ వద్ద ఒకే డిమాండ్‌ చార్టర్‌ ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడం లేదని, తమ సమస్యలను చెప్పుకునేందుకు ఢిల్లీ వైపు వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై హింస, అణచివేత రైతు సమస్యలకు సమాధానం కాదని వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీసహా తమ డిమాండ్లపై కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, చర్చలు చండీగఢ్‌లో జరగాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, కేంద్ర మంత్రులు రెండు విడతలుగా రైతు సంఘాల నేతలతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించడం ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర మంత్రులు ప్రకటించడం, ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని స్పష్టం చేస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments