రాహుల్‌గాంధీ హామీ
అణచివేత చర్యలను ఖండించిన ప్రతిపక్ష నాయకులు
న్యూఢిల్లీ : ‘ఇండియా’ కూటమి కేంద్రంలో అధికారంలోకి రానే రైతుల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టబద్ధత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. మంగళవారంనాడు ఢిల్లీ చలో రైతు ప్రదర్శన ప్రారంభం కాగానే ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేశారు.రైతులను అణచివేసేందుకు హర్యానా సరిహద్దుల్లో, ఢిల్లీలో బిజెపి ప్రభుత్వాలు వేలాదిమంది భద్రతా దళాలను మోహరించడాన్ని
కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా ఖండించారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకోసం రైతులు ర్యాలీ చేస్తుంటే తీవ్రమైన అణచివేత చర్యలు చేపట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. “రైతు సోదరులారా! చరిత్రలో ఇది రక్తాక్షరాలతో లిఖించదగిన రోజు! కాంగ్రెస్‌పార్టీ కూడా రైతులకు ఎంఎస్పిని చట్టబద్ధం చేయాలని నిర్ణయించుకుంది, ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రైతుల డిమాండ్లు నెరవేరుస్తాం అని రాహుల్‌గాంధీ హిందీలో పోస్టింగ్ పెట్టారు. కాగా కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గడచిన పదేళ్ళుగా మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. రైతులపక్షాన కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. “లోక్‌సభ ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల పంటలకు ఎంఎస్పిని చట్టబద్ధం చేస్తామని ఆయన అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చత్తీస్‌గఢ్ అంబికాపూర్ జిల్లాలో రాహుల్‌గాధీ మాట్లాడుతూ కూడా ఇదే విషయం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అసలు ఉద్యమం ఇంకా ముందు ముందు ఉంది అని అన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ కూడా ఈ యాత్రలో మాట్లాడుతూ, రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.
‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఎంఎస్‌పికి చట్టబద్ధత
RELATED ARTICLES