మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్తతెర
పునర్విభజన చట్టం లోపభూయిష్టంగా ఉన్నా కేంద్రంతో ఏనాడూ కొట్లాడలేదు
మంత్రి జూపల్లి
ప్రజాపక్షం/హైదరాబాద్ కెసిఆర్ కృష్ణానది జలాలపైన ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణా రావు విమర్శించారు. ఉద్యమం చేయాల్సినప్పుడు చెయ్యలేదని, ఇప్పడు ఉద్యమం చేస్తానని కెసిఆర్ అంటున్నారని, పునర్విభజన చట్టం లోపభూయిష్టంగా ఉన్నదని ఏనాడు కేంద్రంతో కెసిఆర్ కొట్లాడలేదని మండిపడ్డారు. గాంధీ భవన్లో సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ ఎంఎల్ఏ సి.హెచ్.వంశీచంద్రెడ్డితో
కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కృష్ణారావు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కెసిఆర్ తెలంగాణను నట్టేట ముంచాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కెసిఆర్ కొత్త నాటకానికి తెర లేపాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కెసిఆర్ పరువు కోసం తాపత్రయ పడుతున్నారని అన్నారు. రాష్ట్ర నీటి వాటాను బిఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి బిఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. దొంగే దొంగ అన్నట్లు బిఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు. 2014 నుండి 2023 వరకు బిఆర్ఎస్ చేసిన ఘనకార్యాలను సభ ద్వారా ప్రజలకు తెలియచేస్తామని అన్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా బేసిన్లో 811 టిఎంసి నీటి నిల్వ ఉందని, కానీ తెలంగాణకు చెందిన వాటా దక్కట్లేదన్నారు. ఆ రోజు కెసిఆర్ పట్టించుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వానికి కెసిఆర్ ప్రభుత్వం వత్తాసు పలికిండని దుయ్యబట్టారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ 68 శాతం ఉందని, ఆంద్రప్రదేశ్ 32 శాతం మాత్రమే ఉందన్నారు. దానికి అనుగుంగా కెఆర్ఎంబి ఏర్పడిందన్నారు. 2011లో కెఆర్ఎంబి పరిధిలోకి వొస్తుందని చెప్పింది, ఆరోజు కెసిఆర్ ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. నీటి హక్కుల కోసం కెసిఆర్ ప్రభుత్వం 10 ఎళ్లలో ఏనాడు కొట్లాడలేదన్నారు. ముడుపుల కోసం కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఖర్చు పెట్టారన్నారు. కెఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. అప్పజెప్పుతామని ఎప్పుడు తాము చెప్పలేదని మంత్రి కృష్ణా రావు స్పష్టం చేశారు.
పదేళ్లలో రాష్ట్ర నీటి వాటా సాదించలేని కెసిఆర్ : చల్లా వంశీచంద్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం నీటి వాటాను కెసిఆర్ సాధించలేకపోయారని ఎఐసిసి కార్యదరి,్శ, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు హాజరుకాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏనాడు కెసిఆర్ వెళ్లలేదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా నది కింద ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుంది కెసిఆర్ కుటుంబమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సూపరిపాలన నడుస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు బయట పెడతారనే భయంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు 550 టిఎంసిల వాటా రావాల్సి ఉండగా, కానీ కెసిఆర్ ఏనాడు పోరాడిన దాఖలు లేవన్నారు. తెలంగాణకు కేటాయించిన 299 టిఎంసిలు కూడా కెసిఆర్ ప్రభుత్వం వినియోగించలేదన్నారు. 2014 నుండి 2023 వరకు కేవలం 212 టిఎంసిలు మాత్రమే వినియోగించారని తెలిపారు. నిధులు కేటాయించక పోవడంతో ప్రాజెక్టుల పనులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. మీకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
‘కృష్ణ’పై కెసిఆర్ ఉద్యమం హాస్యాస్పదం
RELATED ARTICLES