కృష్ణా ప్రాజెక్టులు కెఆర్‌ఎంబికి అప్పగింతను ఖండించిన బిఆర్‌ఎస్
రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 13 నల్లగొండలో ‘భారీబహిరంగ సభ’
గులాబీ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్ కృష్ణా నదీజలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుండి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈ నెల 13న నల్గొండ లో ‘భారీబహిరంగ సభ’ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కృష్ణా బేసిన్ పరిధిలోని మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలతో పాటు పార్టీ ప్రముఖులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం కెసిఆర్ సమావేశమయ్యా రు. ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత, శస్త్రచికిత్స జరిగిన తర్వాత మొదటి సారి కెసిఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. దీంతో ఆయనను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కాగా ఈ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులు నదీజలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక వైఖరిపై చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ నాడు ఉద్యమం నడిపించి, తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బిఆర్‌ఎస్ కార్యకర్తలదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి, కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కెఆర్‌ఎంబికి సాగర్ , శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ఉన్న ప్రాజెక్టులను అప్పజెప్పుతూ కేంద్రం చేతికి మన జుట్టు అందించిందన్నారు. ప్రజా క్షేత్రం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని చెప్పారు. కెఆర్‌ఎంబి పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, కేంద్ర వత్తిళ్ళను తట్టుకుంటూ పదేళ్ల పాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి,నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి, కృష్ణా జలాలలో తెలంగాణ కు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని కెసిఆర్ తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు, మాజీ మంత్రులు టి. హరీశ్ రావు, జి జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, , సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు ,జెడ్‌పి ఛైర్మన్లు తదితరులు హాజరయ్యారు.
‘కెఆర్‌ఎంబి’ని వదిలి..పర్రెలొచ్చిన మేడిగడ్డపైన చర్చనా..?
కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా దక్కే వరకు తమ పోరాటం ఆగబోదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొస్తామని బిఆర్‌ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమైన కెఆర్‌ఎంబికి ప్రాజెక్ట్‌ల అప్పగించే అంశాన్ని వదిలి, చిన్నపాటి పర్రెలొచ్చిన మేడిగడ్డ అంశంలో కేసులు పెడుతామంటూ చర్చకు పెడుతారా అని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పగించే అంశంలో ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌తో కనీస సమావేశాన్ని కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. అనాలోచిత తప్పిదానికి, ఘోర అన్యాయానికి పర్యవసానంగా కెఆర్‌ఎంబి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పి, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కృష్ణాజలాల సమస్యను ఇంటింటికీ తీసుకెళ్తామన్నారు. ప్రాజెక్ట్‌లు ఇవ్వడానికి కెసిఆర్ అంగీకరించారని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అబద్ధాలు చెబుతున్నారని, అలా అంగీకరించినట్టు అధికారికంగా నిరూపించగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా నీటి హక్కులకోసం అందరినీ కలుపుకు పోవాలని సూచించారు.
హక్కులు కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడుతాం
RELATED ARTICLES