కోట్ల రూపాయలు వెచ్చించి యంత్రాల కొనుగోలు
ఉపాధ్యాయ సంఘాలతో గత ప్రభుత్వ పాలకుల లాలూచీయే కారణమా?
ప్రజాపక్షం/మేడ్చల్ ప్రజా ప్రతినిధిప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలులోకి తేవాలని గత ప్రభుత్వం భావించింది. అయితే విద్యార్థులకు పక్కాకు బయోమెట్రిక్ హాజరును అమలుపరుస్తున్నా… ఉపాధ్యాయుల విషయంలో మాత్రం లక్ష్యం అటకెక్కింది. దీని కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన బయో మెట్రిక్ యంత్రాలు విద్యాశాఖ వద్దే ఉన్నట్లు సమాచారం. విద్యార్థులకు మాత్రం ఫేషియల్ హాజరు విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ నుండి అమలులోకి తెచ్చిన ప్రభుత్వం… ఉపాధ్యాయుల హాజరు విషయంలో అమలు కాకపోవడం ఉపాధ్యాయ సంఘాలతో లాలూచీ కారణమేనని విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి
వెళితే….ప్రతి నెలా లక్షల్లో జీతాలందుకుంటూ వృత్తిపై నిబద్ధత లేని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే కొందరు ఉపాధ్యాయులు సరైన సమయానికి విధులకు హాజరు కావటం లేదని, తమ సొంత పనులు, సొంత వ్యాపారాలపై శ్రద్ధ చూపిస్తూ హాజరు పుస్తకాల్లో సంతకాలు చేస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారన్న విషయాన్ని విద్యా శాఖ గుర్తించింది. మరి కొంత మంది రోజుల తరబడి అనధికారిక సెలవులు తీసుకుని తర్వాత వచ్చి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఇఒలను గుప్పిట్లో పెట్టుకుని ఒకే సారి హాజరు పుస్తకాల్లో సంతకాలు చేస్తున్న విషయాలూ బయటకు వచ్చాయి. విద్యాశాఖలోని ఉన్నతాధికారులతో లాలూచీ పడిన ఇంకొంత మంది జిల్లాలు, మరో డిపార్ట్‌మెంట్లకు డిప్యూటేషన్‌లు వేయించుకుని ఎక్కడా పని చేయకుండా తాము పని చేసే చోట నుండి అన్ని రోజులు పని చేసినట్లు సంతకాలు చేసి పూర్తి మొత్తాల్లో జీతాలు తీసుకొంటున్నారన్న ఆరోపణలు సైతం ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. దీనికి తోడు తాము పని చేసే పాఠశాలల్లో ఉదయాన్నే వచ్చి హాజరు పుస్తకాల్లో సంతకాలు చేసి డిఇఓ, ఎంఇఓ కార్యాలయాల్లో ఏదో పని ఉన్నట్లు చెప్పి వెళ్లి పోయి తమ సొంత పనులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాన్యువల్ విధానంతో హాజరు విధానం అమలు అవుతున్నందునే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అనేక మంది గైర్హాజరు అవుతున్నారని, దీనికి కళ్లెం వేసే లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బయో మెట్రిక్ యంత్రాలను అమర్చి వాటి ద్వారా వేలి ముద్రలు తీసుకుని హాజరు విధానాన్ని అమలు చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా గత ఏడాది కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి రాష్ట్ర పాఠశాలలకు అవసరమైన బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేసి పలు జిల్లాల విద్యా శాఖ కార్యాలయాలకు సరఫరా చేశారు. తొలుత జిల్లాలోని ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తల పెట్టినా అశించిన మేరకు అమలు చేయలేక పోయారు. దీనికి కారణం ఉపాధ్యాయ సంఘాల్లోని కొంత మంది ప్రముఖులు అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రభావితం చేయటం ద్వారా బయో మెట్రిక్ హాజరు విధానం అటకెక్కించారన్న విమర్శలున్నాయి. ఇదే విధంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 375 ప్రైమరీ, 25 అప్పర్ ప్రైమరీ, 108 జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి.ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బయో మెట్రిక్ హాజరు విషయమై ప్రశ్నించగా ఇంత వరకు జిల్లాలో అమలు కావటం లేదని, తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే అమలు చేయటం జరుగుతుందని జిల్లా విద్యా శాఖ అధికారిణి విజయ కుమారి తెలిపారు. కాగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రం ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
బయోమెట్రిక్ విద్యార్థులకేనా…. టీచర్లకేదీ?
RELATED ARTICLES