HomeNewsTelangana‘సమ్మె, గ్రామీణ బంద్‌'కు సంపూర్ణ మద్దతు

‘సమ్మె, గ్రామీణ బంద్‌’కు సంపూర్ణ మద్దతు

రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపైన మోడీ ప్రభుత్వం దాడి
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకునే వరకు పోరాటం
సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌
కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా సంయుక్తంగా ఈ నెల16న చేపట్టనున్న ‘సమ్మె, గ్రామీణ బంద్‌’కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సిపిఐ జాతీయ సమితి సమావేశం తీర్మానం చేసినట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ వెల్లడించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపైన మోడీ ప్రభుత్వం దాడి చేస్తోందని దుయ్యబట్టారు. దేశ, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వ పాలసీలను నిరసిస్తూ జరుగుతున్న పోరాటంలో రైతులు, కార్మికులు, యువత, మహిళలు అన్ని వర్గాలూ, ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకునే వరకు పోరాటం సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఒక ఎన్నికల జుమ్లా అని, ఇందులో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలను ప్రస్తావించలేదని, కార్పొరేట్‌ శుక్తులకు అనుకూనలంగా ఉన్నదని విమర్శించారు. సిపిఐ జాతీయ సమితి సమావేశంలో చేసిన తీర్మానాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, బాలచంద్ర కాంగోతో కలిసి హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్‌ జీత్‌ కౌర్‌ వెల్లడించారు. కార్మిక, రైతు, ఉద్యోగ, నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలతో భారతదేశం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పదేళ్ల పాలనలో ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశా రు. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం,
లౌకికవాదం,సోషలిజం ప్రాథమిక సూత్రాలను కాపాడేందుకు జరుగుతన్న పోరాటంలో అందరూ ముందుకు రావాలన్నారు. పోరాటాలు, ఆందోళన ద్వారా పాలకులకు తగిన గుణపాఠం చెబుతారని రైతు,కార్మిక పోరాటాల ద్వారా నిరూపణ జరిగిందన్నారు. జాతీయ కార్మిక 44 చట్టాలలో కొన్ని తొలగించి,29 చట్టాలను కలిపి నాలుగు కోడ్‌లుగా ప్రవేశపెట్టారని, ఈ కోడ్‌లు కార్మిక వర్గానికి ప్రమాదకరమని, ఇది వృత్తిపరమైన భద్రతకు నష్టధాయకమని, పనిదినాలను 8 నుండి 12గంటలకు పెంచే ప్రతిపాదన ఉన్నదన్నారు. దేశ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ హక్కులకు కాపాడుకునేందుకు కార్మికులు, రైతులు పరస్పర మద్దతుగా ఐక్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. కిసాన్‌మోర్చా, రైతు, కార్మిక జాతీయ సంఘాలు సంయుక్తగా సమావేశమవ్వడం దేశ చరిత్రలోనే ఇది మొదటి సారి అని, ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు , ప్రజా వ్యతిరేక పాలసీలను నిరసనగా ఉద్యమాలను చేపట్టేందుకు సంయుక్త కార్యాచరణను రూపొందించాయని వివరించారు. అక్టోబర్‌ 3న బ్లాక్‌డేగా నిరసన వ్యక్తం చేశారని, అలాగే కేంద్ర ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం గవర్నర్‌ వ్యవస్థను ఉపయోగించుకుంటూ, బిజెపేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు గురి చేయడాన్ని నిరసిస్తూ నవంబర్‌ 26,27,28న అన్ని రాష్ట్రాల రాజ్‌భవన్‌ కార్యాలయం ముందు మహాపడవ్‌ నిర్వహించామని తెలిపారు. ఈనెల 16న జాతీయ స్థాయిలో పరిశ్రమలు, ఆయా రంగాలలో సమ్మె నిర్వహించేందుకు ఇప్పటికే సమ్మె నోటీసులను అందజేశామని, ఈ సమ్మెలో అన్ని రంగాలకు చెందిన కార్మికులు, రైతులు హాజరవుతారని, దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే గేట్ల ముందు ప్రదర్శనను నిర్వహిస్తారని, బ్యాంకింగ్‌ రంగంలో భోజన సమయంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దుతుగా నిలువాలని కోరారు.
బిజెపిదే తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌
బిజెపిదే తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ అని అమర్‌జీత్‌ కౌర్‌ మండిపడ్డారు.సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎ తదితర సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాల గొంతును అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు సంబంధించిన కార్యాచరణ, సంక్షేమ పథకాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ సేవలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారని, ఉపాధి కల్పన లేదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరైన పోస్టులను భర్తీ చేయలేదని, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామలకు చేపడుతున్నారని, కార్మిక, ఉద్యోగులకు సామాజిక, ఉద్యోగ భద్రత లేదని విమర్శించారు. కార్మిలకుకు కనీస వేతనం రూ 26 వేలకు పెంచాలని, వారికి సామాజిక, ఉద్యోగ భద్రతను కల్పించాలని, కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని అమర్‌ జీత్‌ కౌర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments