ప్రజాపక్షం/హైదరాబాద్ త్వరలో జరగనున్న శాసనసభ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, పలు అంశాలపై బిఆర్ఎస్ ఎంఎల్ఎలకు బిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిశానిర్ధేశం చేశారు. శాసనసభ స్పీకర్ చాంబర్లో కెసిఆర్ గజ్వేల్ ఎంఎల్ఎగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కెసిఆర్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి
ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు బిఆర్ఎస్ ఎంఎల్ఎలు హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్, నందినగర్‌లోని తన నివాసంలో బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు, మాజీ మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే లోక్‌సభ ఎన్నికలపై కెసిఆర్ చర్చించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యథిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ పై ఎంఎల్ఎలు, పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. కాగా ఇటీవల గజ్వేల్ ఎంఎల్ఎగా గెలుపొందిన కెసిఆర్‌కు ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత సుమారు రెండు నెలల తర్వాత కెసిఆర్ బయటికి రావడంతో ఆయనను కలిసేందుకు పార్టీ ముఖ్యనేతలు, ఎంఎల్ఎలు, మాజీ ఎంఎల్ఎలు అసెంబ్లీకి చేరుకున్నారు.
ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం
RELATED ARTICLES