పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి
ప్రజాపక్షం/జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి
రాష్ట్రంలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు రాష్ట్రంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎర్ర చెరువు 280 సర్వే నంబర్లో గత సంవత్సరం గుడిసెలు వేసుకుని జీవిస్తున్న భగత్ సింగ్ నగర్ కాలనీ గుడిసె సెంటర్ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్తో కలిసి సందర్శించారు. భగత్ సింగ్ కాలనీ ప్రధమ వార్షికోత్సవ బహిరంగ సభలో చాడ పాల్గొని మాట్లాడారు. ముందుగా కాలనీలో అరుణ పతాకాన్ని చాడ వెంకటరెడ్డి ఎగురవేశారు. భగత్ సింగ్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సిపిఐ పార్టీ కార్యాలయాన్ని చాడ వెంకట్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించిందని దానికి ప్రతిఫలంగానే రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిందని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు పోరాడిందని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. నిరంకుశ పాలన నుండి ఇప్పుడే ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని, గత ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ప్రగతి భవన్కు వేసిన ఇనుప కంచెను తొలగించారని తెలిపారు. గత ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శంగానే ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకున్నారని ప్రజల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ ఎర్రజెండా సిపిఐ పార్టీనని అన్నారు. గతంలో పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలు గద్దదించారని, ఈ ప్రభుత్వంలో గుడిసెలు వేసుకొని ఎర్ర చెరువులో ఉంటున్న భగత్ సింగ్ కాలనీ వాసులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి భగత్ సింగ్ కాలనీ వాసులకు పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు నీళ్లు కరెంటు రోడ్లు వేయాలని ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ కాలనీ సమస్యలను ప్రత్యక్షంగా కళ్ళతో చూశానని ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సిపిఐ రాష్ట్ర పార్టీ పక్షాన తీసుకెళ్లి పట్టాలు ఇచ్చేవరకు మీకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఎర్ర చెరువులో గుడిసెలు వేసుకొని ఉంటున్న కాలనీవాసులకు సిపిఐ పార్టీ అండగా నిలిచిందని అన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ గద్దె దించే వరకు పోరాడిందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను విస్మరించిందని అందుకే తగిన మూల్యం ఆ ప్రభుత్వం చెల్లించిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల పక్షాన కొట్లాడి మీకు పట్టాలి ఇచ్చేంతవరకు ఈ ఎర్రజెండా పార్టీ సిపిఐ అండగా ఉంటుందని తెలిపారు. గత సంవత్సర కాలంగా భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు ఉంటున్నారని వారికి బాలవికాస ఆధ్వర్యంలో రెండు బోర్లు వేయించే కార్యక్రమం కూడా పార్టీ తరఫున చేస్తామని తెలిపారు. అట్లాగే మన సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అట్లాగే స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో కాలనీవాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చి పక్క ఇల్లు నిర్మించి ఇచ్చి మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిని కలిసి వివరించడం జరుగుతుందని తెలిపారు. మీకు పట్టాలు ఇచ్చేంతవరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, రాష్ట్ర సమతి సభ్యులు బోయిని అశోక్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్, క్యాతారాజ్ సతీష్, జిల్లా కమిటీ సభ్యులు కొరిమి సుగుణ, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, అరబోయిన వెంకటేష్, పీక రవి, లావణ్య, రమేష్, గోలి లావణ్య, వనిత, సుమారు 2000 మంది గుడిసె వాసులు పాల్గొన్నారు.
గుడిసె వాసులకు పట్టాలివ్వాలి
RELATED ARTICLES