HomeNewsTelanganaఫిబ్రవరి నుంచి ఫ్రీ

ఫిబ్రవరి నుంచి ఫ్రీ

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
వంద రోజుల్లో ప్రతి హామీనీ నెరవేరుస్తాం
పార్లమెంట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్కసీటూ రాదు
కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి
ప్రజాపక్షం/ హైదరాబాద్‌

ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీని అమలుచేయనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో సమయంలో తాము ప్రకటించినట్లుగానే 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేసి తీరతామన్నారు. కెసిఆర్‌ సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ర్టం గుల్ల అయ్యిందని, అందువల్లే హామీల అమల్లో కాస్త జాప్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి మొదలుకుని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ల వరకు అన్ని హామీలను బిఆర్‌ఎస్‌ నేతలు విస్మరించారని విమర్శించారు. ఆ పార్టీ నేతల మాదిరిగా తాము ప్రజలను రెచ్చగొడితే, ఫామ్‌హౌస్‌ దాటకపోయే వారని హెచ్చరించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందన్న ఆయన, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు.
ఆరుగ్యారంటీల అమలు దిశగా అడుగులు : మంత్రి శ్రీధర్‌బాబు
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గాంధీభవన్‌లో మంగళవారం నాడు జరిగిన టిపిసిసి మ్యానిఫెస్టో కమిటీ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ఎఐసిసి ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి, రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎఐసిసి ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, మన్సూర్‌ అలీఖాన్‌, మహేష్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షతన వహించిన మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌, మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పాటైన నూతన ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ఇచ్చామని అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
కేంద్రంలో తెలంగాణ మ్యానిఫెస్టో అంశాలను తీసుకుంటాం
వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో రూపొందించడంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అంశాలను పరిశీలనలోకి తీసుకుంటామని ఎఐసిసి ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ చక్రవరి తెలిపారు. మేనిఫెస్టోలు ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విధంగా ఉండాలని చెప్పారు. తెలంగాణ లో మంచి మేనిఫెస్టో అందించినందునే ప్రజలు విశ్వసించారని అన్నారు.ఎఐసిసి మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతున్నదని వెల్లడించారు. మ్యానిఫెస్టో ప్రజలకు అనుకూలంగా ఉండాలని, ఆశ్రిత పెట్టబడిదారి వర్గాలకు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments