HomeNewsNationalఅయోధ్యలో బాలరాముడి విగ్రహావిష్కరణ

అయోధ్యలో బాలరాముడి విగ్రహావిష్కరణ

ఆలయంపై పూలవర్షం కురిపించిన సైనిక హెలికాప్టర్లు
కొత్త యుగం ఆరంభం : మోడీ

అయోధ్య : అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన రామాలయంలో 51 అంగుళాల ఎత్తుగల బాలరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం మధ్యాహ్నం భారీ భద్రతావలయంమధ్య అట్టహాసంగా ఆవిష్కరించారు. బాలరాముడి కళ్ళకు గంతలు విప్పి కాటుక దిద్ది ప్రధమ హారతి ఇచ్చి శ్రీరాముడికి జేజేలు పలికారు. ఈ సందర్భంగా కొత్త రామాలయంపై సైనిక హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. రామాలయాన్ని నిర్మిస్తే దేశం మంటల్లో దగ్ధమైపోతుందని చాలామంది చెప్పారని, అలాంటిదేమీ జరగలేదని మోడీ ఈ సందర్భంగా అన్నారు. ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సొంత కార్యక్రమమని పేర్కొంటూ ప్రతిపక్షాలు బహిష్కరించాయి. “ప్రజలు పునరాలోచించాలని నేను కోరుతున్నా, రాముడు కాల్చే మంట కాదు, శక్తినిచ్చే ఇంధనం, రాముడు వివాదాస్పదుడు కాదు, ఒక పరిష్కారం, రాముడు మనవాడు మాత్రమే కాదు, రాముడు అందరివాడూ, రాముడు కేవలం వర్తమానం కాదు, రాముడు అజరామరం” అని మోడీ అన్నారు. అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సాంస్కృతిక బృందాలు నృత్య,
గాన మాధుర్యాలతో భక్తులను, లక్షలాదిమంది సందర్శకులను అలరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఒక కొత్త యుగానికి ఇది ఆవిష్కరణ అని అన్నారు. శ్రీరాముడు ఇకమీద ఏదో ఒక పందిరి కింద ఉండాల్సిన అవసరం లేదని, దేశం గర్వించదగిన నిర్మాణంలో ఆయన కొలువయ్యాడనీ మోడీ అన్నారు. “ఈరోజున రాముడు వచ్చేశాడు, అనేక యుగాలు ఎదురుచూశాక రాముడు తిరిగి వచ్చాడు, ఇక మన బాలరాముడు తాటాకకు పందిరికింద ఉండే అవసరం లేదు, బ్రహ్మాండమైన ఆలయంలో బాలరాముడు కొలువై ఉంటాడు” అని నరేంద్రమోడీ అన్నారు. లక్షలాదిమంది ఈ కార్యక్రమాన్ని టీవీలలో తిలకించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ ప్రారంభం, జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తికి సబంధించి రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణ రద్దు, ఉమ్మడి పౌర స్మృతి వంటివన్నీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి బిజెపి విజయానికి దోహదం చేస్తాయని కాషాయకూటమి భారీ అంచనాలు వేస్తున్న తరుణంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సహం అట్టహాసంగా చేశారు. ఆలయ గర్భగుడిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుసగా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 84 సెకన్లలో బాలరాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి పూర్తిచేశారు. బిజెపి సీనియర్‌ నాయకులు జెపి నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌ షా, హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ (ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రతతిభాసింగ్‌ కుమారుడు) తదితరులు పాల్గొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలలో కూడా సోమవారంనాడు సెలవుదినం ప్రకటించారు. ప్రముఖులు అనుపమ్‌ ఖేర్‌, కైలాశ్‌ ఖేర్‌, జుబిన్‌ నౌతియాల్‌, ప్రసూన్‌ జజోషి, సచిన్‌ టెండూల్కర్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, పండిత్‌ రవిశంకర్‌ ప్రసాద్‌, అనిల్‌ అంబానీ, హేమ మాలిని, కంగనా రనౌత్‌, శ్రీశ్రీ రవిశంకర్‌, మొరారి బాబు, రజనీకాత్‌, మధుర్‌ భండార్కర్‌, సుభాశ్‌ ఘాయ్‌, సోనూ నిగమ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్‌ డిసి నుండి షిడ్నీ వరకూ అనేకకార్యక్రమాలు జరిగాయి. 380 అడుగుల లోతు, 250 అడుగుల వెడల్పు,161 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఆలయంలో 392 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో మొత్తం 44 తలుపులు బిగించారు. ప్రధానమంత్రి కుబేర్‌ తిల ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ ఆలయం మొదటి దశను రూ.1,100 కోట్లతో నిర్మించారు. మంగళవారం నుండి సాధారణ ప్రజలను అనుమతిస్తారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments