బెంగళూరు: జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి.. సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. నిర్దేశించిన లక్ష్యాలకు మించి పని చేసిన చంద్రయాన్- విక్రమ్ ల్యాండర్ నిద్రాణ స్థితిలోనూ సేవలందిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తాజాగా వెల్లడించింది. ల్యాండర్‌లోని ‘ది లేజర్ రెస్ట్రో రిఫ్లెక్టర్ ఎరే’ (ఎల్‌ఆర్‌ఎ) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘లొకేషన్ మార్కర్’గా పని చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎల్‌ఆర్‌ఎ నుంచి గతేడాది డిసెంబర్ 12న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కి చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఓ) సంకేతాలను గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ సహకార ఒప్పందంలో భాగంగా నాసాకి చెందిన ఎల్‌ఆర్‌ఎను విక్రమ్ ల్యాండర్‌లో పొందుపరిచారు. ఇందులో అర్ధగోళాకార ఆకృతిలో 8 కార్నర్ క్యూబ్ రిఫ్లెక్టర్లు ఉంటాయి. ఏదైనా అంతరిక్ష నౌక ద్వారా విడుదలైన లేజర్ కిరణాలను రిఫ్లెక్ట్ (వికిరణం) చేయడం ద్వారా ఉనికిని తెలియజేసేందుకు ఇవి సహకరిస్తాయి. దీని బరువు 20 గ్రాములు. దశాబ్దాల పాటు సేవలు అందించేలా దీనిని రూపొందించారు. చంద్రయాన్- ప్రాజెక్టులో భాగంగా ఇస్రో రూపొందించిన విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23, 2023న చంద్రుడి దక్షిణధ్రువంపై విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే. ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిసి 14 రోజుల పాటు విస్త్రృత పరిశోధనలు చేసిన విక్రమ్.. కీలక సమాచారాన్ని భూమికి చేరవేసింది. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనా సైతం అసాధ్యమని భావించిన దాన్ని సుసాధ్యం చేసి చూపించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా అవతరించింది. చంద్రయాన్ -3 అన్వేషణ ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఎల్‌ఆర్‌ఎలు పని చేయడం మొదలుపెట్టినప్పటికీ.. ప్రస్తుతానికి ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉందని ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై ‘లొకేషన్ మార్కర్’గా పని చేస్తూ.. భవిష్యత్ పరిశోధనలకు ఇది మార్గనిర్దేశం చేస్తుందని తెలిపింది.
‘లొకేషన్ మార్కర్’గా విక్రమ్ ల్యాండర్
RELATED ARTICLES