హైదరాబాద్ జలసౌధతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు
పలు ఫైళ్లు, పత్రాలు స్వాధీనం
ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఆదేశించేందుకు సర్కార్ సిద్ధమవుతున్న తరుణంలో విజిలెన్స్ తనిఖీల కలకలం
ప్రజాపక్షం / హైదరాబాద్ /కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డవద్ద పిల్లర్ కుంగిపోయిన ఘటన నేపథ్యంలో విజిలెన్స్ అధికారుల బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇరిగేషన్ కార్యాలయాలలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. సంబంధిత కార్యాలయాలలో ఫైళ్ళను, పత్రాలను పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజక్టునిర్మాణంలో అక్రమాలు జరిగాయని, అవినీతి కారణంగానే తక్కువ సమయంలోనే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని శాసనసభలో ప్రకటించింది. అందుకు సంబంధించి మంత్రివర్గంలో కూడా తీర్మానం చేసింది. సిట్టింగ్ జడ్జిని కేటాయించాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా న్యాయవిచారణకు అవసరమైన ఆధారాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెన్వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఇరిగేషన్ కార్యాలయాలలో ఫైళ్ళు మాయమవుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను, ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్‌లోని ఎర్ర మంజిల్ జలసౌధతో పాటు, వివిధ ప్రాంతాలలో పది నీటిపారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌లోనూ అధికారులు దాడులు జరిపారు. సాగునీటి డివిజన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొత్తం 10 ఇంజినీరింగ్ విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి. పది కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో విచారణకు అవసరమైన డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నాయి. సెంట్రల్ డిజైన్, ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. తాళాలు వేసి ఉన్న కార్యాలయాన్ని తెరిపించిన అధికారులు అందులో రికార్డులను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్ ఎస్‌పి రమణారెడ్డితో పాటు ఇద్దరు సిఐల బృందం ఫైళ్లను తనిఖీ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఫేజ్- సంబంధించి ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు గల పనులకు సంబంధించిన పనులను నీటిపారుదల శాఖ అధికారులు ఇక్కడి నుంచి పర్యవేక్షించేవారు. అయితే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక ఇక్కడి నుంచి కార్యాలయాన్ని రామగుండానికి తరలించారు. అడపా దడపా అధికారులు ఇక్కడికి వస్తుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు కార్యాలయ గేట్లను మూసివేసి ఫైళ్లను తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని లక్ష కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమీక్షల్లో బిజీగా మారింది. గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో బ్యారేజీ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారింది. గత నెల 29న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం బ్యారేజీని సందర్శించి, కాళేశ్వరాన్ని అక్రమాల పుట్టగా అభివర్ణించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణకు ఆదేశించేందుకు సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి.
కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు
RELATED ARTICLES