HomeNewsBreaking Newsసింగరేణిలో కొత్త బావుల కోసం పోరాటం

సింగరేణిలో కొత్త బావుల కోసం పోరాటం

పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు
కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజాపక్షం/ ఖమ్మం కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని వేళల అండగా ఉంటుందని, భవిష్యత్తులో కార్మిక వర్గానికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేసేందుకు కృషి చేస్తానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్‌ఎ
కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యథిక మెజార్టీతో తనను గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల విశ్వాసానికి వెలకట్టలేమని వారి విశ్వాసానికి అనుగుణంగా నియోజక వర్గంలో ప్రశాంతత, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తానన్నారు. మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ గతంలో తాను ఎంఎల్‌ఎగా పనిచేసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మహోన్నతుల సమ్మేళనం అని ఎంతో మంది మహానుభావులు ప్రజల పక్షాన ఈ పార్టీకి నాయకత్వం వహించారని వారి స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసిని గెలిపించిన కార్మిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపిన సాంబశివరావు కార్మిక సమస్యల పరిష్కారం, సంక్షేమంతో పాటు సింగరేణిలో బొగ్గు తరిగిపోతున్న నేపథ్యంలో కొత్త బావుల కోసం పోరాడతామని భూ గర్బ బావులను సాధించి తీరుతామని కూనంనేని స్పష్టం చేశారు. సింగరేణిలో ఏఐటియుసి ఆవిర్భవించి 84 సంవత్సరాలు పూర్తయిందని ఆయన తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాలను కలిపి కార్పోరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని కూనంనేని హామీ ఇచ్చారు. కొత్తగూడెం నియోజక వర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇంటి కలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. త్వరలో ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌ పాషా, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్‌ కుమార్‌, నాయకులు వంగా వెంకట్‌, వీరస్వామి, కృష్ణమూర్తి, పార్టీ నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, డి. వెంకన్న, నగేష్‌, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు.
సి అండ్‌ ఎండికి శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని
ప్రజాపక్షం/భద్రాద్రి కొత్తగూడెం ః సింగరేణి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బలరాం (ఐఆర్‌ఎస్‌)కు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుభా కాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయనను పుష్పగుచ్చాన్ని అందించిన ఎమ్మెల్యే శుభా కాంక్షలు తెలిపారు. నూతన భూగర్భ గనులపై ప్రత్యేక దృష్టి సారించి కోల్‌ బెల్ట్‌ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి సింగరేణి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. గుర్తింపు సంఘం ఏఐటియూసిగా అధికార యంత్రాగానికి సంపూర్ణ సహకారాలు అందిస్తామని, కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు. కార్మిక సంక్షేమం, సొంతింటి నిర్మాణం కోసం ప్రణాళికలు చేయాలని, కొత్తగూడెం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కూనంనేనితోపాటు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రథాన కార్యదర్శి రాజ్‌ కుమార్‌, కొత్తగూడెం బ్రాంచ్‌ నాయకులు వంగ వెంకట్‌, రమణమూర్తి శుభా కాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments