బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
పరిధులు దాటి ప్రవర్తించిందంటూ ఆగ్రహం
విడుదలైన 11 మంది దోషులు రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
న్యూఢిల్లీ: గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, హత్యాకాండను కొనసాగించిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం శిక్షా కాలం ముగియక ముందే, ముందస్తుగా విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘దోషులను విడుదల చేసే అధికారం మీకెక్కడిది?’ అని నిలదీసింది. గుజరాత్ ప్రభుత్వం తన పరిధులను దాటి ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గుజరాత్ సర్కారు క్షమాభిక్షతో ముందుగానే విడుదలైన ఆ 11 మంది దోషులను రెండు వారాల్లోగా లొంగిపోవాల్సిందిగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భయాన్తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. 2002 మార్చి 2న, 21 ఏళ్ల బిల్కిస్ బానో కుటుంబంపై అల్లరి మూకలు దాడి చేశా యి. గర్భవతిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారం జరిపిన దుండగులు, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా గుర్తించిన ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై నిందితులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. కాగా, దోషుల్లో ఒకరైన రాధే శ్యామ్ షా ముందస్తు విడుదలకు విజ్ఞప్తి చేసుకోగా, గత ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం అతనితోపాటు, జీవిత ఖైదీ అనుభవిస్తున్న మిగతా దోషులను కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని బానో సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఆమె పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది. దోషులను ముందస్తుగా విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంది. అక్కడి ప్రభుత్వం దోషులకు, నేరస్థులకు సహకరించింది సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విచారణ, తీర్పు యావత్ దేశానికి తెలియాలని పేర్కొంటూ, ఆర్డర్ డెలివరీని ప్రత్యక్షంగా ట్వీట్ చేయడం గమనార్హం. నేరం చేసే వారికి శిక్షలు విధించే సమయంలో ఇచ్చే కఠోరమైన తీర్పు, భవిష్యత్తులో అలాంటి నేరాలకు ఇతరులు పాల్పకుండా అడ్డుకునే రీతిలో ఉండాలని, అప్పుడు సమాజంలో శాంతి, ప్రశాంతత సాధ్యమవుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పు సక్రమంగా లేకపోతే, దోషులకు సమర్థన లభిస్తుందని పేర్కొంది. ఎవరైనా సరే దోషులుగా నిర్ధారించబడి, జైలు పాలైన తర్వాత తమ స్వేచ్ఛను కోల్పోతారని స్పష్టం చేసింది. నేరస్థుడికి శిక్షపడేలా చూసే ప్రభుత్వమే సరైన ప్రభుత్వమని తన ట్వీట్లో సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. బానోతోపాటు, పలువురు వ్యక్తులు, సంస్థలు కూడా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ఏక మొత్తంగా విచారించిన సుప్రీం కోర్టు, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని తీర్పునివ్వడం జరిగిందని తెలిపింది. జీవిత ఖైదును అనుభవిస్తున్న దోషులను విడుదల చేసే విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని జస్టిస్ నాగరత్న అన్నారు. బానో తదితరుల పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను తోసిపుచ్చారు. ఈ కేసును పరిగణనలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇది వరకే వెలువడిన తీర్పుకు కొనసాగింపుగానే ఈ అంశంపై విచారణ జరిగిందని వివరించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విచక్షణతో తీసుకున్నదా? కాదా? అనే కోణంలోనూ కేసు విచారణకు స్వీకరించే నిర్ణయం ఆధారపడి ఉంటుందని జస్టిస్ నాగరత్న వివరించారు. కాగా, ఈ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం 2022 అక్టోబర్ 12న విచారణలను ముగించింది. సుమారు మూడు నెలలకు తీర్పును వెల్లడించింది.
దోషులను విడుదల చేసే అధికారం మీకెక్కడిది?
RELATED ARTICLES