HomeNewsBreaking Newsమత రాజకీయాలకు కాలం చెల్లింది

మత రాజకీయాలకు కాలం చెల్లింది

ఇండియా కూటమిని ఢీ కొనే శక్తి ఎన్‌డిఎకు లేదు
ప్రజాపాలన గాడితప్పితే ప్రశ్నిస్తాం
రాష్ట్రంలో కమ్యూనిస్టుల అవసరాన్ని ప్రజలు గుర్తించారు
కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/భద్రాచలం దేశంలో మత రాజకీయాలకు కాలం చెల్లిందని, మోడీ పాలనను సాగనంపేందుకు ఏర్పాటైన ఇండియా కూటమిని ఢీకొట్టే శక్తి ఎన్‌డిఎకు లేదని కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మతాలు, కూలల పేరిట చిచ్చుపెట్టి పదేళ్ల కాలాన్ని నెట్టుకొచ్చారని ఎద్దేవా చేశారు. దేశంలో మత రాజకీయాలకు కాలం చల్లిందని, ఇంకా అదే తీరులో రాజకీయాలు చేయాలంటే కుదరదన్నారు. తుగ్లక్‌ పాలనతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి అప్పులు పాలు చేసిన కెసిఆర్‌కు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, కేంద్రంలో ఆయినా రాష్ట్రంలో అయినా రాచరికపు నిర్బంధ అహంకారపూరిత పాలన కొనసాగిస్తే ఇటువంటి తీర్పులే వస్తాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరు మాసాల పాటు వారికి కూడా సమయాన్ని ఇస్తామని, అప్పటి కూడా ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులేయకుంటే ప్రశ్నించేందుకు వెనుకాడేదే లేదన్నారు. జిల్లా పార్టీ, ప్రజా సంఘాల విస్తరణకు, బలోపేతానికి గ్రామశాఖల నుండి జిల్లా స్థాయి వరకు శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌ పాషా మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని, అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని, పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, మున్నా లక్ష్మీకుమారి, కె. సారయ్య, ఏపూరి బ్రహ్మం, కమటం వెంకటేశ్వరరావు, ఎస్‌డి సలీం, చంద్రగిరి శ్రీనివాసరావు, రావులపల్లి రవికుమార్‌, నరాటి ప్రసాద్‌, రేసు ఎల్లయ్య, సలిగంటి శ్రీనివాస్‌, దేవరకొండ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా బ్రమల్లోనే బిఆర్‌ఎస్‌
ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నట్లుగానే బిఆర్‌ఎస్‌ వాళ్లు బ్రమల్లో ఉన్నారని కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశలంలో ఆయన మాట్లాడుతూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమి పాలైందని, అయినా వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లపాటు ప్రజాధనాన్ని తమ సొంత డబ్బుల్లా దాచుకున్నారని, ప్రాజెక్టుల పేరుతో కోట్లరూపాయల బిల్లులు కాజేశారని మండిపడ్డారు. ఇంతకాలం పచ్చి అబద్ధాలతో పాలన సాగించారని, ఇక వారి గారటీ మాటలు, మాయంత్రాలు ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పతనం చేసి రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసి చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు,సింగరేణి కార్మికులకు సమయానికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని, బ్యాంకుల నుండి అప్పులు తెచ్చి కార్మికుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సిపిఐకి ఒకే సీటు ఉన్నప్పటికీ కోట్ల మంది అభిమానులు ఉన్నారని, అందుకు సింగరేణి ఎన్నికలే నిదర్శనం అన్నారు. సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియూసి అనుబంధంగా సింగరేణి, ఆర్‌టిసి, మిడ్డే మీల్స్‌, ఆశ, కో ఆపరేటివ్‌, బ్యాంక్స్‌, మెడికల్‌, బిహెచ్‌ఇఎల్‌, స్కీం వర్కర్లు తదితరులు ఉన్నారని, వీరిని ఓటు బ్యాంకు రూపంలో మార్చుకుంటామని, మంచి కార్యకర్తలను తయారు చేసుకుంటామని చెప్పారు. ఏపిలోకలిసి ఐదు పంచాయితీలు తిరిగి తెలంగాణాలో కలిపేందుకు ఇద్దరు సిఎంలు చర్చించుకుని ప్రజలకు మేలు చేయాలని, ఆ పంచాయితీలు భద్రాచలంలోనే కలిస్తేనే అభివృద్ది జరుగుతుందన్నారు. భద్రాచలం వరద శాశ్వత నివారణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో చర్చిస్తానని, కరకట్ట ఎత్తుపెంచి డిజైన్‌ మారిస్తే ఈ ప్రాంతం వరద నుండి కాపాడబడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్తప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు తప్పకుండా అందుతాయని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్‌, రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు, బందెల నర్సయ్య, సలిగంటి శ్రీనివాస్‌, చంద్రగిరి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments