ఎకరానికిపైగా ఆక్రమణ
స్పందించని వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఫిర్యాదు
విద్యార్థి సంఘాల ఆందోళన
ప్రజాపక్షం/కరీంనగర్ ప్రతినిధి కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ (ఎస్యు)కి అనుబంధంగా ఎల్ఎండిలో ఉన్న ఫార్మసీ కళాశాల భూమిపై భూబకాసురులు కన్నేశారు. కళాశాలకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే ఎకరానికిపైగా భూమిని కబ్జా చేశారు. యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల వెనుక వైపున ఉన్న ప్రైవేటు భూములకు దారి లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా లేదు. దీంతో ఆ ప్రైవేటు భూముల విలువ పెంచుకునేందుకుగాను ఫార్మసీ కళాశాల భూమి నుంచి నేరుగా దారి వేయించుకున్నారు. ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో ఆ భూమిలో పాత షెడ్డును కూల్చివేసి చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని దారి నిర్మించుకున్నారు. ఈ భూకబ్జా విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ శ్రీశైలం యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించి సీరియస్‌గా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు ఎవరూ నోరుమెదపకుండా అదే కాంట్రాక్ట్ అధ్యాపకునితో ఈ నెల 5న వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. కోట్లాది రూపాయల విలువైన కళాశాల భూమి కబ్జాకు గురవుతుంటే యూనివర్సిటీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నా యి. కబ్జాదారులకు యూనివర్సిటీ ఉన్నతాదికారులు వత్తాసు పలుకుతున్నారంటూ, వారి సహకారంతోనే కళాశాల భూమిని దర్జాగా కబ్జా చేసినట్లు, కబ్జాదారుల నుంచి లక్షలాది రూపాయలు యూనివర్సిటీ ఉన్నతాదికారులకు ముట్టడంతో వారు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
అధికారుల పాత్రపై అనుమానాలు!
ఎస్యుకి అనుబంధంగా ఎల్ఎండిలో నిర్వహిస్తున్న ఫార్మసీ కళాశాల 42.14 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో ఆరు సంవత్సరాల కింద 5 ఎకరాలు మౌలానా అబుల్ కలామ్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)కి, 5 ఎకరాలు సైన్స్ సెంటర్‌కు కేటాయించారు. ఇప్పటివరకు ఆ వైపుగా పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు 1.5 ఎకరాలను సెంట్రల్ ఇండస్ట్రియల్ టూల్స్ అండ్ డిజైన్‌కి కేటాయించగా దాని పనులు ప్రారంభించారు. గతంలో పలుమార్లు భూకబ్జాదారులు కళాశాల భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కాగా మిగిలిన 30.04 ఎకరాలను భూ కబ్జాదారుల నుంచి సంరక్షించుకోవడానికి గత రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ ఉమేష్ కుమార్, ఇంచార్జి వైస్ చాన్స్‌లర్ టి.చిరంజీవులు హయాంలో చుట్టూ ప్రహారీ గోడ, బాలబాలికల వసతి గృహాలు, ఇతర భవనాల నిర్మాణాలకు అనుమతి సైతం తీసుకున్నారు. అయితే ఆ పనులు ముందుకు సాగలేదు. రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్ నియామకం అయినప్పటికీ గతంలో అనుమతులు తీసుకున్న పనులు చేపట్టకపోవడం పలు అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది. కళాశాల భూమిలో ప్రహారీ నిర్మాణం జరిగితే వెనుకవైపు గల ప్రైవేట్ భూములకు దారి లేకుండా పోతుంది. కోట్లాది రూపాయల భూములకు దారి లేకపోతే రియల్ వ్యాపారం సాగదనే భయంతో తమ పలుకుబడితో అధికారులను లక్షలాది రూపాయల ముడుపులతో మచ్చిక చేసుకున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారులతో మిలాఖత్ కాకుంటే కోట్లాది రూపాయల విలువైన భూములను అప్పనంగా కబ్జా చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడమేమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కబ్జాదారులపై పిడి యాక్టు నమోదు చేయాలి
శాతవాహన విశ్వవిద్యాలయం ఎల్ఎండి ఫార్మసీ కళాశాలకు చెందిన భూమిని భూభకాసురుల నుంచి కాపాడాల్సిన అధికారులు చూసీచూడనట్లు ఉండడం వల్లే తరుచుగా కబ్జాలకు ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మసీ కళాశాలకుచ చెందిన 42.14 ఎకరాల భూమిని సర్వే చేయాలి. సర్వే నివేదికను బహిర్గతం చేయాలి. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతుంటే యూనివర్సిటీ విసి, ఈసి సభ్యులు ఏం చేస్తున్నారు? యూనివర్సిటీలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ భూముల చుట్టూ ప్రహారీ నిర్మించాలి. విసి రిజిస్ట్రార్, యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఫార్మసీ కళాశాల భూములను కాపాడి కబ్జా చేసే వారిని శిక్షించాలి.
మణికంఠ రెడ్డి, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
Error: Contact form not found.
Error: Contact form not found.
Error: Contact form not found.
Error: Contact form not found.