ప్రజాపక్షం/హైదరాబాద్ బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సంపూర్ణ ఆరోగ్యవంతుడై త్వరలోనే ప్రజల్లోకి వస్తారని మాజీమంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ భవన్లో శనివారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కెసిఆర్ ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారన్నారన్నారు. త్వరలోనే కెసిఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయన్నారు. కెసిఆర్కిట్పై కెసిఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోందన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎంఎల్ఎలు అంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు. కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతుబంధు కూడా వేయలేదన్నారు. రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు. అభివృద్ధి చేసినా దుష్ప్రచారం వల్ల ఓడిపోయామన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, మన సత్తా ఏమిటో చూపిద్దామని హరీశ్ రావు అన్నారు.
త్వరలో ప్రజల్లోకి కెసిఆర్
RELATED ARTICLES