రాష్ట్రానికి ఐపిఎస్ అధికారుల కేటాయింపును పెంచండి
కేంద్రమంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ
ప్రజాపక్షం/హైదరాబాద్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రాష్ట్రానికి ఐపిఎస్ అధికారుల కేటాయింపును పెం చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కూడా సిఎం కలిశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలవాలని సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఎఐసిసి కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అయ్యారు.
పాలమూరు జాతీయ హోదా కోరాం: ఉత్తమ్
‘పాలమూరు- ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరామని అనంతరం మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి మీడియాతో చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌గర్, వికారాబాద్, నారాయణ్‌పేట్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ చేశారని తెలిపారు. మొత్తం 90 టిఎంసిల నీరు 60 రోజుల్లో లిఫ్ట్ చేసే ప్రణాళిక అన్నారు. జాతీయ హోదా ఇస్తూ 60 శాతం వ్యయం కేంద్రం భరించాలని కోరామన్నారు. జాతీయ హోదా ప్రస్తుతం ఏ ప్రాజెక్టులకు ఇవ్వడంలేదని, ఇతర పథకాల కింద 60 శాతం నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.