అడ్రస్, ఫోన్ నంబర్ల
మార్పు కోసం ఇక్కట్లు
ఉదయం నుంచే సెంటర్లకు పరుగులు
తిండి తిప్పలు మాని గంటలకొద్దీ పడిగాపులు..
జనం తాకిడితో నిర్వాహకులకు ఇబ్బందులు
ప్రజాపక్షం/పినపాక రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అందుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్‌కార్డు ప్రతి దానిని పొందుపరచాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులు అప్‌డేట్ చేసుకోవాలని ప్రచారం సాగుతుండడంతో చాలా మంది అప్‌డేట్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 7 గంటల నుండే పినపాక మండలోని ఏడూళ్ళ బయ్యారం ఎస్‌బిఐ బ్యాంక్ వద్ద ఆధార్ అప్‌డేట్ ఆన్లున్ సెంటర్ ఉండడంతో మహిళలు, చిన్నపిల్లలతో సహా క్యూలైన్ లో నిలబడి పడిగాపులు కాయడంతో ఆధార్ అప్‌డేట్ కొరకు అవస్థలు పడుతున్నారు. అడ్రస్‌లు, పేర్లు, ఫోన్ నంబర్లు ఇతరాత్ర మార్పులతో కొత్త కార్డులు పొందేందుకు ఎగబడుతున్నారు. ఒక్కొక్క సెంటర్‌లో రోజుకు 50 నుంచి 60 కార్డులు మాత్రమే అప్డేట్ చేసే అవకాశమున్నా అంతకు మించి బారులు తీరుతున్నారు. తిండి తిప్పలు మాని గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. అయితే ప్రస్తుత ఆరు గ్యారంటీలకు చేస్తున్న దరఖాస్తులకు ఆధార్ అప్‌డేట్ అవసరం లేదని అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా రోజుల కొద్దీ తిరుగుతూ ప్రజలు ఆగమవుతున్నారు. ఆధార్ నమోదు, అప్‌డేట్ చేసుకోవాలంటే ఫాం నింపాల్సి ఉంటుంది. దీంతో అది నింపడం రాని కొందరూ, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫాం నింపడం తెలియక కొంత మందికి పరీక్షే అవుతుంది. ఆధార్ కేంద్రం వెలుపల కూర్చుని,ఆధార్ ఫాం నింపేందుకు, ఒకరు నింపిన దానిని చూసి, ఇంకొకరూ నింపుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అప్‌డేట్ కోసం వందల మంది వచ్చి దరఖాస్తులు ఇస్తున్నప్పటికీ, రోజుకు 30 నుంచి 40 వరకు మాత్రమే అప్‌డేట్ అవుతున్నాయి. దీంతో పలువురు రోజంతా నిరీక్షించి వెనుదిరిగి వెళ్తూ, మరుసటి రోజు రావల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరైతే బడికి వెళ్లిన పిల్లలను, హాస్టల్‌లో ఉన్నవారిని ఇంటికి తీసుకువచ్చి ఒక్క రోజులో పని అయిపోతుందనుకుంటే, కావడం లేదని ఒక్కొక్కరూ, రెండు, మూడు రోజులు ఆన్లున్ సెంటర్ల కు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆధార్ నమోదు కేంద్రాలు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.