కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND)ల మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. పేస్ బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఒకే రోజు 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమై 55 పరుగులకే ఆలౌటైన సఫారీలు.. బంతితో అదరగొట్టి టీమ్ఇండియాను 153 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 98 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. మొదటి 10 ఓవర్లు నిలకడగానే ఆడి 37/0 స్కోరు చేసింది.అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. ముకేశ్ కుమార్ తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్ (12) ఫస్ట్ స్లిప్‌లో కోహ్లీకి చిక్కాడు. వన్‌డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి (1) వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే ట్రిస్టన్ స్టబ్స్ (1)ని బుమ్రా బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 62/3 స్కోరుతో నిలిచింది. బెడింగ్హమ్ (7*), మార్క్రమ్ (36*) క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 36 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అనుహ్యంగా కుప్పకూలిన భారత్
ఓపెనర్ రోహిత్ శర్మ (39; 50 బంతుల్లో), వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు), విరాట్ కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు చేసేలా కనిపించిన భారత్.. అనుహ్యంగా 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమ్ఇండియా.. చివరి సెషన్లో అనుహ్యంగా కుప్పకూలింది. భారత్ తన చివరి ఆరు వికెట్లను 11 బంతుల వ్యవధిలో 153 పరుగుల వద్దే కోల్పోవడం గమనార్హం. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్ప్రీత్ బుమ్రా (0)లను పెవిలియన్‌కు పంపాడు. రాహుల్.. వికెట్‌కీపర్ వెరినేకు క్యాచ్ ఇవ్వగా.. జడేజా, బుమ్రా స్లిప్‌లో మార్కో జాన్సెన్కు చిక్కారు. రబాడ వేసిన తర్వాతి ఓవర్లో కోహ్లీ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో సిరాజ్ (0) రనౌట్ కాగా.. ప్రసిద్ధ్ కృష్ణ (0) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0) పరుగుల ఖాతా తెరవలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, నండ్రీ బర్గర్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
సిరాజ్ మియా మాయ.. భారత్‌పై అత్యల్ప స్కోరు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను భారత పేసర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ (6/15) నిప్పులు చెరిగే బంతులు సంధించి సఫారీలకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు ఇదే. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఓ ప్రత్యర్థి జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే.
ఆతిథ్య జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డేవిడ్ బెడింగ్హమ్ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారంటే మన బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఐదెన్ మార్క్రమ్ (2), డీన్ ఎల్గర్ (4)లను సిరాజ్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. స్లిప్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో మార్క్రమ్ వెనుదిరగ్గా.. ఎల్గర్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే బుమ్రా బౌలింగ్‌లో స్టబ్స్ (3) రోహిత్‌కు చిక్కాడు. టోనీ డి జోర్జి (2) సిరాజ్కే చిక్కాడు. అనంతరం ఒకే ఓవర్లో బెడింగ్హామ్, మార్కో జాన్సెన్ (0)ని ఔట్ చేసి ఈ హైదరాబాదీ పేసర్ తర్వాతి ఓవర్లోనే వెరినేని పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా, ముకేశ్ కుమార్ మిగతా పని పూర్తి చేశారు.
- ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు అత్యధిక వికెట్లు (23) తీయడం ఇది రెండోసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజే 25 వికెట్లు పడగొట్టారు.