HomeNewsBreaking Newsగృహలక్ష్మి గోస

గృహలక్ష్మి గోస

ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన కొత్త పథకం
రూ.3 లక్షలు ఇస్తారని పాతఇండ్లు కూల్చివేత
కొత్త నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులు
గృహలక్ష్మి రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం
ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి రాష్ట్రంలో పేదలకు ఇండ్లు నిర్మించుకునేందుకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకం పేదల ఇండ్లు పీకి పందిరేసిన చందంగా మారిం ది. ఎన్నికల ముందు హడావిడిగా గత ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ని ప్రవేశపెట్టగా, ఇప్పుడు ఆ పథకం రద్దు కావడంతో పేదలు అరిగోస పడే పరిస్థితి తలెత్తింది. గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలు ఇస్తారని ఆశ పడితే మొదటికే మోసం వచ్చింది. కాం గ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిపెస్టోలో భాగంగా ప్రకటించిన అభయ హస్తం ఆరు గ్యారంటీలలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనుండడంతో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మిపథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గ్రామాలలో గృహలక్ష్మికింద ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహలక్ష్మిపథకం కింద దరఖాస్తు చేసుకున్నవారు దాదాపు 15 లక్షల మంది ఉండగా, గత ప్రభుత్వం దాదాపుగా 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,12,095 మందికి ఎన్నికల ముందు మంజూరు పత్రాలను కూడా అంద జేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో చాలా మంది పాత ఇండ్లు కూలగొట్టుకుని కొత్త ఇండ్లకు పునాది వేసుకున్నారు. మరికొంత మంది తమ సొంత జాగాలో ప్రభుత్వ పథకానికి ఆశ పడి, స్థానిక బిఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి కొత్త ఇంటి నిర్మాణాని ముగ్గు పోసుకున్నారు. ఆయా గ్రామాలలో, మండలాలలో స్థానిక బిఆర్‌ఎస్‌ నాయకుల, ప్రజాప్రతినిధులతో ముగ్గు పోసుకుని కొబ్బరి కాయలు కొట్టించారు. ఈ కార్యక్రమాలను ఎన్నికల వేళ ప్రచారం కూడా చేసుకున్నారు. గృహలక్ష్మిపథకం కింద మొదటి విడత రూ.1 లక్ష రూపాయలు వస్తాయని ఆశ చూపారు. దీంతో చాలా చోట్ల నాయకులు చెప్పినట్లే లబ్ధిదారులు బేస్‌మెట్ల వరకు కట్టుకుని ఎదురు చూశారు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ రావడంతో మొదటి విడత డబ్బులు ఎన్నికల అనంతరం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ మారిపోవడంతో గృహలక్ష్మిపథకం లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. గృహలక్ష్మిపథకం ఉంటుందా లేదా అన్న అనుమానాలు మొదటి నుండి వ్యక్తమవుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని రద్దు చేయడంతో గృహలక్ష్మిపథకం లబ్ధిదారులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఇండ్లు నిర్మించుకునేందుకు అప్పులు చేసి కిరాయి ఇండ్లలో ఉంటున్న పేదలకు ఇది ఆశని పాతంగా మారింది. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో స్థానిక చోటా మోటా లీడర్లకు కమిషన్లు ముట్ట చెప్పిన పేదలు రెండు రకాలుగా నష్టపోయినట్లు అయిందని ఆవేదన వ్యక్త చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాలలో ప్రతి గ్రామంలో 15 నుండి 30 ఇండ్లకు ముగ్గులు పోసుకున్నారు. చాలా చోట్ల బేస్‌మెట్ల లెవల్‌ నుండి స్లాబ్‌ వరకు, గోడల వరకు నిర్మాయం చేసుకుని ఎదురు చూస్తున్నారు. అర్హులు అయిన వారే కాకుండా మరికొంత మంది లిస్టులో పేరు లేని వారు కూడా ఆయా గ్రామాలలో, మండలాలలో స్థానిక బిఆర్‌ఎస్‌ నాయకుల, ప్రజాప్రతినిధుల హామీలతో సొంత జాగాలో ముగ్గు పోసుకుని ఇండ్ల నిర్మాణం ప్రారంభించకున్నవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారంతా వేలకు వేలు పెట్టి కిరాయి ఇండ్లలో ఉంటున్నారు. తీరా నేడు ప్రభుత్వం పాత పథకాన్ని రద్దు చేయడంతో వారికి ఆశనిపాతంగా మారింది. కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మేనిపెస్టోలో భాగంగా ప్రకటించిన అభయ హస్తం ఆరు గ్యారంటీలకు ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. వీడిని క్రోడీకరించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వచ్చిన దరఖాస్తులను తేల్చి అందులో అర్హుల జాబితాను తయారు చేసినా ప్రస్తుత గృహలక్ష్మి లబ్ధిదారులకు చోటు దక్కుతుందనే గ్యారంటీ లేదు. దీంతో గృహలక్ష్మి లబ్ధిదారులుగా ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారందరు ఏం చేయాలో పాలు పోక తలలు పట్టుకుంటున్నారు.తమను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఎలాగైనా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments