తలసరి ఆదాయంలో తెలంగాణే నెంబర్ వన్
ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/కామారెడ్డి / బాన్సువాడ/ సంగారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉత్తుత్తి ప్రచారాలను నమ్మొద్దని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరాస్తాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ భారతదేశంలోనే తలసరి ఆదాయంలో 3.18 లక్షల రూపాయలతో నెంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. ఆనాడు కరెంటు ఎప్పుడు వస్తదో తెలవని పరిస్థితి అని, ఇప్పుడు రైతులు దర్జాగా పంట సాగు చేసుకుంటున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ ఇస్తున్నామని, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు మంటగలుపుతది, ధరణి తీసేస్తది, రైతుబంధును రద్దు చేస్తది.. ఆలోచించి ప్రజలు ఓట్లు వేయాలన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు తసలరి విద్యుత్ వినియోగం 1100 యూనిట్లు ఉంటే నేడు 2200 యూనిట్లు పెరిగింది. కెసిఆర్ బతికి ఉన్నత వరకు తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతుందన్నది నిజం అన్నారు. ప్రజలు కట్టిన పన్నులను కెసిఆర్ రైతుబంధు రూపంలో దుబారా చేస్తున్నారని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని, ఇది ఎంత వరకు సమంజసమన్నారు. అంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదని, రైతుబంధు పుట్టించిందే బిఆర్ఎస్ అని అన్నారు. ఎవరైనా రైతు మరణిస్తే రైతుబీమా ద్వారా 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందజేసి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. రుణమాఫీ 35 వేల కోట్ల రూపాయలు రెండు దఫాలుగా చేసుకున్నాం. ఈ విధంగా ఏ రాష్ట్రంలో చేయలేదని చెప్పారు. ఇప్పటి వరకు కొంతమంది రైతులకు రుణమాఫీ రాగా త్వరలోనే మిగిలిన రైతులకు వస్తుందన్నారు. లెండి ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తిచేసుకుందామని, ప్రాజెక్టు నిర్మాణంలో మాహారాష్ట్ర చేతులెత్తేసిందన్నారు. నాగమడుగు పథకం పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయని, వచ్చే వర్షాకాలానికి 40 వేల ఎకరాలకు నాగమడుగు సాగునీరు అందిస్తుంది. సింగూరు నుండి కావాల్సినన్ని నీరు ఉందని, నిజాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వస్తుందని, రైతులకు ఎలాంటి రందీ లేదన్నారు. జుక్కల్‌లో కరువు కాటకాలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కొత్త మండలాలు కావాలని హన్మంత్‌షిండే పట్టుబట్టి కొత్త మండలాలను ఏర్పాటు చేరని తెలిపారు. బిచ్కుందలో డయాలసిస్ సెంటర్, 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేశామని, త్వరలోనే పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకుంటామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేసిన హన్మంత్షిండేను నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు, ఓటర్లను కోరారు.
బాన్సువాడ కాదు బంగారువాడగా మారింది
బాన్సువాడ నియోజకవర్గం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో బానిసవాడ బంగారు వాడగా మారిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పిడికెడు మందితో ఉద్యమం చేపట్టి ఉప్పెనల తెలంగాణ ప్రజల సహకారంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వలసలు, నిరుద్యోగం, కరెంటు చీకట్లు, సాగునీటి సమస్య, అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడి పోయిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అందరి కృషితో అభివృద్ధి పథంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకువెళుతుందన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రైతాంగం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, రైతుల పంటల ఎరువుల కోసం ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు కేంద్రంతో కొట్లాడి ఎరువులు తీసుకువచ్చి రైతన్న బలోపేతం చేయడంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృషి చేయడంతో తాను లక్ష్మిపుత్రుడని నామకరణం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి చేశానని గుర్తుచేశారు. రాష్ట్రంలో 200 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, బాన్సువాడలో ఉర్దూ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనునిత్యం నియోజకవర్గ ప్రజల సంక్షేమంకోసం పాటుపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఎన్నికల్లో లక్ష మెజార్టీతో బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో పెద్ద హోదాలో ఉంటారన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకున్నాం : పోచారం
బాన్సువాడ నియోజకవర్గంలోని ఏ రంగాన్ని కాదనకుండా అన్ని రంగాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిధులు కేటాయించడంతో బాన్సువాడ నియోజకవర్గం నిండుకుండలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో సాగునీటి రంగానికి వెయ్యి కోట్లు ముఖ్యమంత్రి కేటాయించడంతో జాకోరా, చందూరు రిజర్వాయర్లు, చెక్ డ్యాములు పూర్తయితే గుంట ఎండకుండ రైతులకు రెండు పంటలకు సరిపడా సాగునీరు ఉంటుందన్నారు. కెసిఆర్ కృషితో నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు, బాన్సువాడ పట్టణ అభివృద్ధి కోసం 650 కోట్లు అభివృద్ధి జరిగిందన్నారు. బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి తల్లిపాలను ప్రోత్సహించడంలో జాతీయస్తాయి అవార్డు వచ్చిందని, ఇటీవలే మూడు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్‌కు వెంకటేశ్వరుడి విగ్రహం స్పీకర్ పోచారం కుటుంబ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో రాస్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, నిజామాబాద్ జడ్పి ఛైర్మన్ విఠల్‌రావు, ఉమ్మడి జిల్లా డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, రైతుబందు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్లు కృష్ణారెడ్డి, గంగుల గంగారాం, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు పిట్ల శ్రీధర్, పాత బాలకృష్ణ, గురు వినయ్, ఎజాస్, నియోజకవర్గంలోని ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆగమై ఓటువేయొద్దు ….
ఎన్నికలప్పుడు ఓటర్లు విఙ్ఞతతో ఆలోచించాలని, పోటీ చేస్తున్న పార్టీల వైఖరి, చరిత్రను పరిశీలించాలని కెసిర్ అన్నారు. ఓటు వేసేటప్పుడు ఆగం కావద్దని అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో ప్రజాశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఉన్న నారాయణ ఖేడ్‌కు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నారాయణ ఖేడ్‌కు జమానా ఫరక్ ఉందన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు నారాయణ ఖేడ్ రావాలంటే బయపడేవారన్నారు. ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలతో నారాయణ ఖేడ్ రూపురేఖలు మారిపోయాయన్నారు. గతంలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉండేదన్నారు. బసవేశ్వర,సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి కొరత లేకుండా చేస్తానన్నారు. మల్లన్న సాగర్ ద్వారా నర్సాపూర్‌కు ఒక కోటి ఎనబై ఐదు లక్షల ఎకరాలకు నీరు అందిస్తానన్నారు. నారాయణ ఖేడ్ దశ దిశ పూర్తిగా మార్చేస్తానన్నారు. గతంలో కరెంటు త్రాగు నీరు పరిస్థితి ఎట్లా ఉండేదో గమనించాలన్నారు. ఈ సమావేశంలో జహిరాబాద్ ఎంపి బీబీ పాటిల్ , నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి, జడ్పీచైర్ పర్సన్ మంజుశ్రీ , మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఉత్తుత్తి ప్రచారం నమ్మవద్దు
RELATED ARTICLES