తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో ఈ నెల 27న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వినాయక నిమజ్జనం కారణం గా తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ర్ట అధ్యక్షురాలు పి. ప్రేంపావని, కార్యనిర్వాహక అధ్యక్షుడు పుసాల రమేష్, ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.విజయలక్ష్మి, గౌరవాధ్యక్షులు డి.కమలారెడ్డి సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశా రు. ‘చలో హైదరాబాద్’కు సంబంధించిన తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వంట కార్మికుల పెంచిన వేతనాలు, వంట బిల్లులు, కోడిగుడ్ల బిల్లుల బకాయిలు తక్షణం ఖాతాల్లో జమచేయాలని ఈ నెల 20వ తేదీ నుండి రాష్ర్ట వ్యాపితంగా మధ్యాహ్న భోజన వంట కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను విజవంతంగా నడుస్తున్నందుకు వారు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో చేస్తున్న దశల వారీ పోరాటాల ఫలితంగా పెంచిన వేతనాలు జిఒ ఆర్టి నెం.139 ప్రకారం జులై నుండి అమలు చేసేందుకు రూ. 97,56,18,000 (రూ.97.56 కోట్లు) అలాగే ఆగస్టు, సెప్టెంబర్ నెలల 1 నుండి 8 తరగతుల వారికి కోడి గుడ్ల బిల్లులు జిఒ ఆర్టి నెం. 138 ప్రకారం రూ.17,82,74,000 (రూ.17.82 కోట్లు), ఆర్టి నెం. 141 ప్రకారం 9 నుండి 10 తరగతుల వంట బిల్లులు రూ.22,02,48,000 (రూ.22.02 కోట్లు) బిల్లులు విడుదల చేయటం పోరాటాల ఫలితమేనని పేర్కొన్నారు. ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు యధావిధిగా సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు. రాష్ర్ట ప్రభుత్వం అక్టోబర్ 24 దసరా పండగ నుండి అల్పాహారం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం సంబంధించి వంట కార్మికులకు ఏ విధమైన పారితోషికాలు ఇవ్వబడతాయో స్పష్టత లేకపోవటం ఇప్పటికే వంట కార్మికులు సంబంధిత పాఠశాలల్లో రాగిజావ కాచి పిల్లలకు అందజేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దానికి అయ్యే ఖర్చును కార్మికులకు ఇవ్వవలసిన అదనపు పారితోషికాలు కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటం ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మాత్రమే చేస్తున్నదని, ఇతర సంఘాలకు సంబంధం లేదని ప్రకటించారు. డిమాండ్లు సాధించుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా
RELATED ARTICLES