దళిత మహిళను వివస్త్రను చేసి.. చితకబాది.. ఆపై మూత్ర విసర్జన
బీహార్‌లో వడ్డీ వ్యాపారి ఘాతుకం.. ఆరుగురిపై కేసు నమోదు..
పాట్నా: దేశంలో మహిళల మానప్రాణాలకు విలువ లేదని, వారికి రక్షణ లేనేలేదని మరోసారి రుజువైంది. తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించని కారణంగా దళిత మహిళను ఓ వడ్డీ వ్యాపారి వివస్త్రను చేసి ఊరేగించి సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. అంతేగాక, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. అపై మూత్ర విసర్జన చేయించి, ఆమెను దారుణంగా అవమానించాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాట్నా జిల్లా ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ భర్త ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ప్రమోద్ సింగ్ అనే వడ్తీ వ్యాపారి వద్ద వద్ద రూ.1500 అప్పుగా తీసుకుంది. అయితే, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీనితో ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అన్షు సింగ్, మరో నలుగురు ఆమె ఇంటికి వెళ్లి, బయటకు లాక్కొచ్చి, దారుణంగా కొట్టారు. ఆమెను వివస్త్రను చేశారు. అనంతరం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షుతో ఆమెపై మూత్ర విసర్జన చేయించాడు. శనివారం అర్థరాత్రి జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా, నిందితుల నుంచి వడ్డీకి రూ.1500 తీసుకున్నామని, వడ్డీ, అసలు మొత్తం కూడా తిరిగి ఇచ్చేశామని సదరు బాధిత మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. కానీ, వడ్డీకి వడ్డీ లెక్క చూపి, ఎక్కువ డబ్బులు బకాయిలు ఉన్నాయని చెబుతున్నారనీ, ఆ డబ్బులు ఇవ్వకుంటే గ్రామంలో వివస్త్రను చేసి ఊరేగిస్తామని తనన బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే ప్రమోద్ సింగ్ కొడుకు, అతని సహచరులతో కలిసి తనను బలవంతంగా ఈడ్చుకుంటూ వాళ్ల ఇంటికి తీసుకెళ్లి, అక్కడ బట్టలు విప్పి కర్రలతో దారుణంగా కొట్టారని వివరించింది. మహిళ అనే జాలి, దయ లేకుండా ప్రవర్తించడమేగాక, తనపై మూత్ర విసర్జన చేశారని కూడా ఆరోపించింది. అతి కష్టం మీద అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నానని బాధితురాలు తెలిపింది. కాగా, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అన్షుసహా మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు.
అప్పు చెల్లించలేదని..
RELATED ARTICLES