మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కచ్చితంగా గెలుస్తాం
రాజస్థాన్‌లోనూ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కచ్చితంగా గెలుస్తామని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని, రాజస్థాన్‌లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుంటామని స్పష్టం చేశారు. లోక్‌సభలో బిఎస్‌పి ఎంపి దినిష్ అలిపై బిజెపి ఎంపి రమేష్ బిదూరి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ కుల గణన డిమాండ్ నుంచి దృష్టి మళ్లించేందుకు బిజెపి పన్నిన వ్యూహం అని అభివర్ణించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు. అసోం ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన సదస్సులో రాహుల్ పాల్గొని మాట్లాడారు. నిజమై ప్రజాసమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకు కాషాయ పార్టీ వేసిన ఎత్తుగడే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అని రాహుల్ విమర్శించారు. ‘దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొందరి వద్దే డబ్బంతా పోగైంది. అసమానతలు, భారీ స్థాయి లో నిరుద్యోగం, ఒబిసిలు, గిరిజనులపై బిజెపి పక్షపాతం వంటివి ప్రధానంగా ఉన్నాయి. కానీ బిజెపి ఎప్పుడు వీటి ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయదు. ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. దేశం పేరు మారుద్దామని అంటోంది’ అని ఆ పార్టీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. వాటిని తాము అర్థం చేసుకున్నామని, అలా చేయనివ్వమని ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, మిజోరామ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అన్న ప్రశ్నకు రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ అధికారంలోకి వస్తామని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తామని, రాజస్థాన్‌లోనూ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటామని చెప్పారు. తెలంగాణలో బిజెపి కన్నా కాంగ్రెస్‌యే ముందుంజలో ఉందన్న రాహుల్.. అక్కడ ఆ పార్టీ పూర్తి క్షీణించిందన్నారు. కర్ణాటక ఎన్నికల నుంచి తాము చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు రాహుల్ గాంధీ. తమ ఉద్దేశ్యాన్ని ప్రజలు చెప్పకుండా బిజెపి అడ్డుకుంటోందని ఆరోపించారు. తాము కులాల వారీ లెక్కలు అడుగుతుంటే ఎంపిలు బిధూరి, నిషికాంత్ దుబేల ద్వారా బిజెపి వివాదాస్పద ప్రకటనలు చేయిస్తోందని రాహుల్ మండిపడ్డారు. సమస్యలపై ప్రజల్లో చర్చ జరగకుండా చూస్తోందని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ప్రజా సమస్యలపై కాకుండా వివాదాస్పద విషయాలపై చర్చ ఉండేలా ప్రయత్నించిందన్న రాహుల్.. దాని తమ పార్టీ సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్ర ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడిందని తెలిపారు. ఈ మధ్య జరిగిన తన లద్దాఖ్ పర్యటనను కూడా రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు జనాభా గణనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘దేశం పేరును ఇండియా నుంచి భారత్ మార్చాలనుకున్నారు. కానీ ఆ చర్య ప్రజలకు ఇష్టం లేదు. ఆ విషయం తెలుసుకున్న బిజెపి వెనక్కి తగ్గింది. దీంతో వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది’ అని రాహుల్ ఆరోపించారు. చట్టసభల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు కావాలని ఆయన డిమాండ్ చేశారు.