లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్
33 శాతంలో ఎస్‌సి,ఎస్‌టిలకు సీట్లు రిజర్వు
వచ్చే ఎన్నికల్లో అమలుకు నో ఛాన్స్
రాజ్యాంగ సవరణ, డీ లిమిటేషన్ తర్వాతే..
న్యూఢిల్లీ : ఎట్టకేలకు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. 27 ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రచార పటాటోపం మధ్య మంగళవారం మోడీ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనంలో సభ ముందు ఉంచింది. కేంద్రమంత్రి మేఘావల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగానికి 128 వ సవరణ ద్వారా ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. కొత్తపార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బిల్లు ఇదే. అదేవిధంగా ఎస్‌సి,ఎస్‌టి మహిళలకుకూడా ఈ 15 సంవత్సరాలపాటు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఈ రిజర్వేషన్లు అమలులో ఉండేవిధంగా బిల్లును రూపొందించారు. అదేవిధంగా ఎస్‌సి,ఎస్‌టి మహిళలకుకూడా ఈ 33 శాతంలో సీట్లు రిజర్వు చేశారు. లోక్‌సభ కార్యకలాపాలకు ఒక అనుబంధ జాబితాగా ఈ బిల్లును జత చేశారు. ఈ రిజర్వేషన్ల ద్వారా దాదాపు మొత్తం లోక్‌సభ స్థానాలలో మూడోవంతు స్థానాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేస్తారు. 15 ఏళ్ళు అమలులో ఉంటాయి. తిరిగి మరోసారి తర్వాత సభలో బిల్లు ఆమోదించవలసి ఉంటుంది. డీలిమిటేషన్ ప్ర క్రియ జరిగిన ప్రతిసారీ రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని బిల్లు పేర్కొంది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేముందుగాప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ వేదికపై తొలి ప్రసంగం చేస్తూ మహిళలకు లోక్‌సభ 33 శాతం రిజర్వేషన ్లబిల్లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. అయితే లోక్‌సభలో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ లేకపోవడంతో వివిధ పార్టీలమధ్య సఖ్యత కొరవడి ఆనాడు బిల్లు ఆమోదం పొందలేదు. ఇప్పుడు బిజెపికి లోక్‌సభలో సంపూర్ణమైన మెజారిటీ ఉన్నందువల్ల ప్రతిపక్షాల నుండి లభించే మద్దతు కేవలం అదనపు బలంగా మాత్రమే ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 81 మంది మహిళలసంఖ్య సుమారు 181 కి చేరుకుంటుంది. అయితే ఈ బిల్లును డీలిమిటేషన్ (లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత మాత్రమే వర్తింపజేయసే అవకాశం ఉంది. బహుశా 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియనాటికి ఈ వ్యవహారం ఓ కొలిక్కివచ్చే అవకాశం లేదు. డీ లిమిటేషన్ ప్రక్రియ జరగాలంటే రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ సవరణ అనంతరమే పునర్విభజన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. 1971 సవరణ చట్టం ప్రకారం మరో మూడేళ్ళవరకూ ఆ అవకాశం లేదు. అయితే పార్లమెంటు తదుపరి స్పందనబట్టే ఈ ప్రకియకు అవకాశం ఉంటుంది. ప్రధామంత్రి సభలో మాట్లాడుతూ, జి వేదికపై అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం దిశగా ముమ్మర చర్చలు జరిగాయని, దేశంలో మరింత మంది మహిళలు పెద్దసంఖ్యలో అభివృద్ధి ప్రక్రియలో భాగస్వ్యాం కావాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నదని అన్నారు. “మహిళలకు ఈ అధికారాలు సమకూర్చే ఘనకార్యం సాధించడం కోసమే బహుశా దేవుడునన్ను పుట్టించి ఉంటాడు, ఇందుకోసం తమ ప్రభుత్వం కూడామరోసారి ఈ దిశగా చర్యలు తీసుకుంది” అని ప్రధానమంత్రి ఉద్వేగంతో అన్నారు. రాజ్యాంగలోని 368 వ అధికరణలోని నిబంధనల ప్రకారం కనీసం 50 శాతం రాష్ట్రాల ఆమోదం ఈ రాజ్యాంగ సవరణకు అవసరం అవుతుందని అధికార వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రాల హక్కులకు భంగం రాకుండా ఉండేందుకే వాటి ఆమోదం అవసరం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 2010 మార్చినెలలో ఆనాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సగానికి సగం రాష్ట్రాలు ఈ విధమైన బిల్లులకు ఆమోదం తెలియజేయవలసి ఉంటుందని ఆయన సభలో చెప్పారు.
భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే
బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించండిః మోడీ
మహిళా రిజర్వేషన్ బిల్లు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ బిల్లును “నారీశక్తి వందన్ అధినియం” గా ఆయన పిలిచారు. లోక్‌సభ, అసెంబ్లీలలో మ భాగస్వామ్యం దీనిద్వారా పెరుగుతుందని ఆయన అన్నారు. ఉభయసభలూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన కోరారు. కొత్తలోక్‌సభలో మోడీ తొలి ప్రసంగం చేస్తూ ఈ విషయం చెప్పారు. సోమవారంనాడు మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలియజేసింది. సమాజంలో రాజకీయాలలో గణనీయమైన పరివర్తన రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. “నారీశక్తి వందన్ అధినియమ్” తదుపరి భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది, నేను తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను, ఈ బిల్లును చట్టరూపంలోకి తీసుకురావడానికే తాము కట్టుబడి ఉన్నాం అని ప్రధానమంత్రి అన్నారు. ప్రధాని ప్రకటనతో అటు ప్రతిపక్షాలు, ఇటు అధికార పక్షం కూడా బల్లలు చరిచి హర్షాతిరేకం ప్రకటించారు. ప్రతిరంగంలోనూ మహిళలు అభివృద్ధి సాధించాలని, మరింతమంది మహిళలు జాతికి సేవలు అందించాలని అన్నారు. ఈ చరిత్రాత్మకమైన రోజున మహిళలకు అవకాశాలు కల్పించేందుకు తలుపులు బార్లా తెరవాలని కోరారు. మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా దేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేందుకే బిల్లును ఉద్దేశించామన్నారు.అనేక సంవత్సరాలుగా ఈ బిల్లుకోసం ఎన్నో చర్చలు జరిగాయి, అనేక ప్రయత్నాలు పార్లమెంటులో జరిగాయి, మొదట 1996లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. వాయ్‌పేయి ప్రధానిగా ఉండగా, అనేకసార్లు ఈ బిల్లును తెచ్చామని, కానీ ఈ కల నెరవేరలేదని మోడీ అన్నారు. గతంలో జరిగిన చేదు అనుభవాలన్నీ ఎంపీలు అందరం వదిలేద్దాం, నూతన అధ్యాయం ప్రారంభిద్దాం అన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలకున్న లక్ష్మణరేఖను ఎంపిలు అందరూ అనుసరించాలని కోరారు. ఏ రాజకీయపార్టీ లభ్దికోసమో ఈ సభ లేదని, దేశ అభవృద్ధికోసమే ఈ సభ ఉందని అన్నారు. దేశానికి సేవచేయడానికే పార్లమెంటు అత్యున్నతస్థానంలో నిలబడి ఉందని అన్నారు. 140 కోట్లమది ప్రజల ఆకాంక్షలను ఈ సభ ప్రతిబింబిస్తుందన్నారు. ఒక కొత్త అధ్యాయం ప్రారంభిద్దాం, పాత చేదు అనుభవాలను వదిలేద్దాం అని ప్రధానమంత్రి అన్నారు.
కొత్త పార్లమెంటు భవనంలోమహిళా రిజర్వేషన్ బిల్లు
RELATED ARTICLES