HomeNewsBreaking Newsమణిపూర్‌ హింసవెనుకకార్పొరేట్‌ ధనదాహం

మణిపూర్‌ హింసవెనుకకార్పొరేట్‌ ధనదాహం

వనరులు లూటీచేయాలనే కార్పొరేట్‌ దురాశకు బిజెపి ప్రభుత్వాలు అందిస్తున్న అండదండలవల్లే జాతుల మధ్య ఘర్షణ
కాషాయపార్టీ కుటిల, సంకుచిత రాజకీయాలకు మూల్యం చెల్లిస్తున్న మణిపూర్‌ ప్రజలు
హింసకు ముగింపు ఎప్పుడో తెలియడంలేదు
‘మణిపూర్‌ ఒక రాజకీయ విశ్లేషణ’పై సదస్సులో సిపిఐ పార్లమెంటరీ పార్టీ నాయకులు బినొయ్‌ విశ్వం
ప్రజాపక్షం / హైదరాబాద్‌
సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్‌ దురాశకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సిపిఐ పార్లమెంటరీ పార్టీ నాయకులు, జాతీయ కార్యదర్శి బినొయ్‌ విశ్వం అన్నారు. మణిపూర్‌ తల్లులు, సోదరీమణులతో దేశమంతా ఉన్నదని ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రగల్భాలు పలికారని, కానీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఒక్కసారైనా పర్యటించలేదని విమర్శించారు. బిజెపి కుటిల, సుంకుచిత రాజకీయాలకు మణిపూర్‌ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని, అక్కడ హింసకు ముగింపు ఎప్పుడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు,
సుప్రసిద్ధ జర్నలిస్టు సి.రాఘవాచారి జయంతిని పురస్కరించుకొని రాఘవాచారి ట్రస్ట్‌, నీలం రాజశేఖర్‌ రెడ్డి పరిశోధనా కేంద్రం, సిఆర్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌ (పాత ప్రెస్‌ క్లబ్‌)లో ఆదివారం నాడు ‘మణిపూర్‌ ఒక రాజకీయ విశ్లేషణ’ అనే అంశంపై సదస్సు జరిగింది. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బినొయ్‌ విశ్వం కీలకోపన్యాసం చేయగా, ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్‌ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఐడిపిడి ఉపాధ్యక్షులు డాక్టర్‌ రజినీ ప్రసంగించారు. సభకు రాఘవాచారి ట్రస్టు ట్రస్టీలు బుడ్డిగ జమిందార్‌ అధ్యక్షత వహించగా, డాక్టర్‌ అనుపమ ట్రస్టు కార్యకలాపాలను వివరించారు. మాజీ ఎంఎల్‌సి పి.జె.చంద్రశేఖర్‌ రావు వందన సమర్పణ చేశారు. జాతుల ఘర్షణ నేపథ్యంలో మణిపూర్‌లో రెండు సార్లు పర్యటించిన బినొయ్‌ విశ్వం కీలకపన్యాసం చేస్తూ మణిపూర్‌లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి ప్రధాని మోడీ అనేక దేశాలలో పర్యటించారే తప్ప మణిపూర్‌కు మాత్రం వెళ్ళలేదన్నారు. చివరకు పార్లమెంటులో అవిశ్వాస పరీక్షపై చర్చకు మోడీ సమాధానమిస్తూ మణిపూర్‌తో భారతదేశం ఉన్నదని ప్రకటించారని, కనీసం ప్రచారం కోసమైన పార్లమెంటు సమావేశాల మరుసటి రోజు మణిపూర్‌కు వెళ్ళి వస్తారని భావించామని, కాని వెళ్ళలేదన్నారు. మణిపూర్‌లో జరుగుతున్నది కేవలం ఆర్థిక, సాంస్కృతిక, జాతుల సంఘర్షణ మాత్రమే కాదని, వీటి వెనుక కార్పొరేట్‌ ధన దాహం ఉన్నదని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాలైన మణిపూర్‌ కొండల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదపై అదానీ కన్నుపడిందని, అందుకే ఆయనకు లాభం చేకూర్చేందుకు బిజెపి ప్రభుత్వాలు జాతుల ఘర్షణకు తెరలేపాయన్నారు. మైతీలు, కుకీల మే నెల 3వ తేదీ నుండి ఘర్షణలు కొనసాగుతున్నాయని, మణిపూర్‌ గాయాలతో రక్తమోడతున్నదని , ఇవి ఎప్పుడు అంతమవుతాయో అనేది ఇప్పటికీ ప్రశ్నలాగే మిగిలిపోయిందన్నారు. నాలుగు మాసాలుగా వేర్వేరు క్యాంపులలో మగ్గుతున్న మైతీలు, కుకీలు స్వంతిళ్ళకు ఎప్పుడు వెళ్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకులు ఈడుస్తున్నారని చెప్పారు. కేవలం తన అధికార స్వార్థం కోసం మైతీల భుజాలపై ఒక చేయి, కుకీల భుజాలపై మరో చేయి వేసి, బ్రిటీష్‌ వారి విభజించు పాలించు విధానాన్ని అమలు చేసి, ఘర్షణలకు బిజెపి కారణమైందన్నారు. ఇరు జాతులు కూడా బిజెపిపై విశ్వాసం కోల్పోయారని, బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని , ముఖ్యమంత్రి ఘర్షణలను నిరోధించడంలో విఫలమయ్యారని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో కుకీలు, మైతీలు ఘర్షణ పడినా , కొద్ది రోజులకు సమసి పోయి కలిసిపోయేవారని, ఇప్పుడు బిజెపి కుటిలత్వం కారణంగా ఘర్షణలకు ఎప్పుడు ముగింపో కూడా తెలియడం లేదని విశ్వం అన్నారు. మణిపూర్‌లో ప్రభుత్వం నడుపుతున్నది సహాయక శిబిరాలు కావని, శరణార్థుల శిబిరాలు అని, స్వంత దేశంలోనే మణిపూర్‌ వాసులు శరణార్థులలాగా దుర్భరంగా బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశానికి మణిపూర్‌ ఒక హెచ్చరిక లాంటిదని, ప్రజలంతా ఏకమై దేశ ఐక్యతను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను చెబుతున్నదన్నారు.
ప్రతిపక్షాల ఐక్యతతోనే తెరపైకి ‘భారత్‌’
బిజెపికి విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా 28 రాజకీయ పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయని, దీంతో బిజెపి ప్రభుత్వం ఏకంగా భారతదేశ పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలని చూస్తున్నది బినొయ్‌ విశ్వం విమర్శించారు. దశాబ్దాలుగా భారతదేశాన్ని ఇండియా అని పిలుస్తున్నారని, అదే సమయంలో భారత్‌ అని కూడా అంటున్నారని, ఈ రెండు పేర్లలో దేనితోనైనా పిలవొచ్చన్నారు. ప్రతిపక్ష కూటమి పేరు ఇండియా ఉండడంతో పాటు సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇష్టానుసారం భారత్‌ అని మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
రాఘవాచారి బహుముఖ ప్రజ్ఞాశాలి
రాఘవాచారితో తనకు పరిచయం ఉన్నదని, ఆయన గొప్ప మార్కిస్ట్‌ జర్నలిస్టుల అని బినయ్‌ విశ్వం కొనియాడారు. కమ్యూనిస్టు జర్నలిస్టుగా జీవితాంతం పార్టీ పత్రిక విశాలాంధ్రకు ఒక స్థంభంగా నిలపడ్డారని గుర్తు చేశారు. రాఘవాచారి గొప్ప ఆలోచనపరుడు, రాజకీయ మేధావి, జరనలిస్టు, సాంస్కృతిక జ్ఞాని అని , బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు.
సురవరం సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ డబల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉన్న మణిపూర్‌లో నిత్యం ఘర్షణ మంటలు ఆరడం లేదని విమర్శించారు. మణిపూర్‌ నుండి, బర్మ, నేపాల్‌ సరిహద్దుల మధ్య కంచలు కూడా లేవన్నారు. గతంలో తాను మణిపూర్‌ కు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి నిర్ఘాంతపోయానని, కనీసం రవాణ, రహదారుల సౌకర్యం లేదని, పరిశ్రమలు కూడా లేవని వివరించారు. గతంలో అక్కడ వ్యక్తిగతంగా మాత్రమే ఘర్షణ వాతావరణం ఉండేదని, ఇప్పుడు రెండు జాతుల మధ్య ఘర్షణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాఘవాచారి సంపాదకీయాలు అద్భుతంగా, విశ్లేషణాత్మకంగా ఉండేవని ప్రశంసించారు. కొత్తగా బిజెపి పార్టీ ఏర్పడినప్పుడు తమది ‘గాంధీ-సోషలీజం’ అని చెప్పుకున్నారని, దానిపైన రాఘవాచారి రాసిన సంపాదకీయంలో గాంధీ తన మాటల్లో ఎప్పుడూ సోషలిజాన్ని ప్రస్తావించలేదని, అలాగే గాంధీని బిజెపి ఎన్నడూ విశ్వసించలేదని, అలాంటిది గాంధీ-సోషలిజం ఏమిటోనని రాసిన విషయాన్ని సురవరం సుధాకర్‌ రెడ్డి గుర్తు చేశారు.
కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం తాము మణిపూర్‌ వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులపైన మణిపూర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడామని, సమస్య పరిష్కారానికి రాజకీయ నిబద్ధత ఉండాలని , అది ఈ ప్రభుత్వాలకు లేదని ఆయన తమతో చెప్పినట్టు వివరించారు. దేశంలో ఏర్పడుతున్న ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొని, వాటిని పరిష్కరించేందుకు వామపక్షాలు, ప్రగతిశిల శక్తులు ముందుకువెళ్లాలన్నారు.
కాగా ఇండియన్‌ డాక్టర్స్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఐడిపిడి) వైద్యుల బృందం మణిపూర్‌లోని శరణార్థుల శిబిరాలను సందర్శించిన వివరాలను డాక్టర్‌ రజని వివరించారు. శిబిరాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, మందులు, సరైన ఆహారం అందడం లేదని,వారికి వైద్యమౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్‌ తదితర సమస్యలతో పది మంది వరకు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments