ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసిన కేంద ఎన్నికల కమిషన్
మరోవైపు కొవింద్‌తో సమావేశమైన అమిత్ షా
భోపాల్/ న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ నినాదంతో జమిలీ ఎన్నికల నిర్వహణకు మోడీ సర్కారు తొందరపడుతుండగా, రాజ్యాంగ నిబంధనల మేరకే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మరోవైపు జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నివేదిక అందించేందుకు ఏర్పాటైన ప్యానెల్ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, న్యాయశాఖా మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్యానెల్ అధికారిక తొలి సమావేశాన్ని కోవింద్ బుధవారం నిర్వహిస్తారని తొలుత ప్రచారమైం ది. ఆయన కమిటీ సభ్యులతో సమావేశమైనట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే, అమిత్ షా, మేఘ్‌వాల్ మాత్రమే కోవింద్‌ను కలిసినట్టు పిటిఐ తన వార్తా కథనంలో పేర్కొంది. ప్యానెల్ త్వరలోనే సమావేశమవుతుందని, తేదీ, ప్రదేశం వివరాలు తొందరలోనే తెలుస్తాయని వివరించింది. ఈ ప్యానెల్‌కు కోవింద్ అధ్యక్షత వహిస్తుంగా, అమిత్ షా, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ కశ్యప్, 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కె సింగ్, మాజీ సివిసి సంజయ్ కొఠారీ, రాజ్యసభలోమాజీ ప్రతిపక్ష నేత గులాబ్‌నబీ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు. కాగా, నవంబర్ మాసంలో ఎన్నికలు జరగాల్సివున్న మధ్యప్రదేశ్‌లో ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తన బృందం తో కలిసి భోపాల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలు, రిప్రజెంటెటివ్ ఆఫ్ పీపుల్ (ఆర్‌పి) చట్టం ప్రకారమే దేశంలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. నిర్ణీత సమయంలోగా ఎన్నికల ప్రక్రియను ముగించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి, పార్లమెంటు తొలి సమావేశమైన తేదీ నుంచి ఐదేళ్లలోగా తిరిగి ఎన్నిగలు జరగాల్సి ఉంటుందన్నారు. ఇదే సూత్రం రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని వివరించారు. నిర్ణీత సమయం కంటే ఆరు నెలల ముందు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవకాశం ఎన్నికల కమిషన్‌కు ఉందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ విధానంపై అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ, రాజ్యాంగం, ఆర్‌పి చట్టం ప్రకారమే ఎన్నికల కమిషన్ నడుచుకుంటుందని అన్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత తమపై ఉందంటూ, నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.
రాజ్యాంగ నిబంధనల మేరకే..
RELATED ARTICLES