ఆయకట్టు రైతుల ఆశ ఆవిరి
పరీవాహక ప్రాంతంలో తగ్గిన పంట సాగు
నీటి విడుదలకు అన్నదాతల ఎదురు చూపు
ప్రజాపక్షం/ సూర్యాపేట ప్రతినిధి నీటి సవ్వడి లేక కృష్ణమ్మ మూగబోయింది. ఎగువ ప్రాంతంలో సరైన వర్షాలు కురుకపోవడంతో ఎప్పుడూ నిండు కుండలా తొణకిసలాడే నాగార్జునసాగర్ జలశయం నేడు వెలవెలబోతోంది. వాన కాలం సీజన్ మొదలై మూడు నెల లు అవుతున్నా నీటి లభ్యత లేకపోవడంతో అధికారులు పంట సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీంతో ఆయకట్టు రైతుల పంట సాగు ఆశలు ఆవిరయ్యాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో పంట సాగు అదును తప్పింది. బావులు, బోర్లు ఉన్న రైతులు మాత్రమే నీటి లభ్యతను బట్టి వరి సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులకు ఈ వనరులు లేకపోవడంతో తమ పంట భూములను బీడుగా వదిలివేశారు. ముందో… వెనుకో…ప్రాజెక్ట్‌లోకి నీరు వచ్చి విడుదల చేయకపోతారా తాము పంటను పండించకపోతామా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6లక్షల 32వేల 180 హెక్టార్లలో రైతులు పంటను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు అంచనా వేయగా ఆయకట్టు పరిధిలో 5లక్షల 65వేల 303 ఎకరాల్లో పంట సాగు కానుందని తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 2లక్ష 29వేల 961ఎకరాల్లో పంట సాగు కానుందని శ్రీరాంసాగర్ రెండవ దశ ద్వారా 2లక్షల 13వేల 175 ఎకరాలు, మూసీ ప్రాజెక్ట్ 15,230, చెరువులు 1071 ద్వారా 69వేల 385 ఎకరాలు కాగా ఐడిసి ఎత్తిపోతలు(54) కింద 54,713 ఎకరాల్లో పంట సాగు కానుందని తెలిపారు. ప్రధానంగా జిల్లాలో వరి సాగు సుమారు 4లక్షల 65వేల 500 ఎకరాల్లో రైతులు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో వర్షా భావ పరిస్ధితులు నెలకొన్న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో గోదావరి జలాలు పారుతుండటంతో ఈ ప్రాంత రైతులు ముందస్తుగానే పంట సాగు చేసినా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో నేటికి అధికారులు పంట సాగుకు నీటిని విడుదల చేయకపోవడంతో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని క్రిష్ణా పరివాక ప్రాంత రైతులు పంట సాగు ప్రశ్నార్ధకంగా మారింది. చెరువులు, కుంటలు కూడా నీరు లేకపోవడంతో వారు పంట సాగు చేయలేక భూములను బీడ్లుగా వదిలారు. 5 ఎకరాల పైబడి ఉన్న రైతులు కొంతమంది గతంలో తమకు ఉన్న బావులు, బోర్లను మరమ్మత్తులు చేసుకొని పంట సాగు చేస్తుండగా కొంతమంది రైతులు చేతిలో చిల్లి గవ్వ లేకున్నా అప్పు చేసి బోర్లు, బావులు తీయిస్తున్న పరిస్ధితులు ఉన్నాయి. సాగర్ ఆయకట్టు పరిధిలోని మొత్తం 2లక్షల 29వేల 961 ఎకరాలు కాగా ఇందులో 50శాతానికి మించి రైతులు పంట సాగు చేసిన దాఖలాలు లేవు. క్రిష్ణమ్మ గలగల సవ్వడితో నిత్యం కలకలలాడుతూ పచ్చని పైర్లతో ఉండే ఈ పరివాక ప్రాంతం నీటి విడుదల కాకపోవడంతో కళ తప్పింది. వాన కాలం పంట సాగు ఆదుపు తప్పుతున్నా రైతులు మాత్రం సాగర్ నీటి విడుదలకై ఎదురు చూస్తున్నారు. జిల్లాలో సరైన వర్షాలు పడకున్న ఎగువ ప్రాంతంలో వర్షాలు పడి ప్రాజెక్ట్ నిండుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. ఏ సమయం ఏలా ఉంటుందోనని ముందుగానే వారు పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్దం పెట్టుకున్నారు. సాగర్ ప్రాజెక్ట్‌కు నీటి నిల్వలు రాకుంటే ఆయకట్టు ప్రాంతాన్ని క్రాప్ హలీడేగా ప్రకటించిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మూగబోయిన కృష్ణమ్మ
RELATED ARTICLES