సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్1 ప్రయోగ ముహూర్తం ప్రకటించిన ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రాజెక్టును విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి, సూర్యుడిపై పరిశోధనలకు సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11:50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి గా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతమైతే, సూర్యుడి గురించి, సౌర కుటుంబం, వాతావరణం గురిచి లోతైన అధ్యయనానికి మార్గం సుగమమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ (షార్) నుంచి ఆదిత్య ఎల్‌వన్1ను పిఎస్ఎల్వి సి 57 వాహన నౌక నింగిలోకి మోసుకుపోతుందని ఇస్రో తన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ ఉపగ్రహం శ్రీహరి కోటకు చేరిం ది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునేవారి ముందుగా తమతమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని జోసఫీ లాగ్రాంజ్ పాయింట్1 వద్ద కక్షలోకి ప్రవేశపెడతారు. అంతకు మించి సూర్యుడికి దగ్గరిగా వెళ్లడం అసాధ్యం. ఆదిత్య ఎల్ 1 ఇదే కక్ష నుంచి సౌర వ్యవస్థపై పరిశోధనలు జరుపుతుంది. సూర్యుడి పుట్టుక నుంచి అక్కడి వాతావరణ పరిస్థితుల వరకూ.. సౌర తుఫానుల నుంచి నీలిలోహిత కిరణాలతో ముంచుకొచ్చే ప్రమాదాల వరకు పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఇస్ట్రో భావిస్తున్నది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనాల కోసం ఏడు పేలోడ్స్‌ను పంపనుంది. అంతరిక్షంలో సూర్యుడు, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తులు ఆకర్షణ, వికర్షణల మెరుగైన ప్రాంతాలను ఉత్పత్తి చేసే స్థానాలను లాగ్రాంజ్ పాయింట్లు అంటారు. అమెరికా అంతరియ పరిశోధమనా సంస్థ నాసా అధ్యయనం ప్రకారం, సౌర కక్షలో ఉండే సమయంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి అంతరిక్ష నౌకలు ఈ లాంగ్రేజ్లను వినియోగించుకుంటాయి. ఇటాలియన్ గణిత శాస్త్రజ్ఞుడు జోసెఫీ-లూయిస్ లాగ్రాంజ్ గౌరవార్థం ఈ పాయింట్లకు ఆయన పేరును ఖరారు చేశారు. ఈ పాయింట్ నుంచి సూర్యుడిని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం పరిశీలించే అవకాశం ఉంటుంది. గ్రహణాల ఆటంకాలు కూడా ఉండవు. లాగ్రాంజ్ ఎల్1 పాయింట్ నుంచి నాలుగు పేలోడ్స్ నిరంతరం సూర్యుడిని గమనిస్తూ ఉంటాయి. మిగతా మూడు పేలోడ్స్ ‘ఇన్ సిటు’ అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఈ ప్రయోగం సౌర వ్యవస్థ అధ్యయనంలో కొత్త శకాన్ని సృష్టిస్తుందని ఇస్రో ఆశిస్తున్నది.
అవరోధాలను అధిగమిస్తూ..
చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ప్రాంతంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ అవరోధాలను సమర్థంగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నది. తాజాగా ఇస్రో రెండు ఫొటోలను విడుదల చేసింది. నాలుగు మీటర్ల లోతైన గోయిని గుర్తించిన ప్రజ్ఞాన్ ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా మారి మార్చుకుంది. ప్రజ్ఞాన్ రోవర్ అద్భుతంగా పని చేస్తున్నదని, అనుకున్న లక్ష్యాలు సాధిస్తుందని ఇస్రో ధీమా వ్యక్తం చేసింది.