పార్టీ మారాలంటూ అనుచరుల ఒత్తిడి త్వరలో నిర్ణయం
ప్రజాపక్షం/ ఖమ్మం ఖమ్మంజిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమైంది. బిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ కేటాయించకపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆ పార్టీ నుంచి లభించలేదు. పార్టీ మారితే తప్ప ఇక రాజకీయ భవిష్యత్తు లేదన్న ఆలోచన తుమ్మల అనుచరుల్లో మొదలైంది. ఏడు పదుల వయస్సుకు దగ్గరలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ దఫా ఎన్నికల రణ క్షేత్రంలో లేకుంటే ఇక మరోమారు వయసు సహకరించకపోవచ్చు లేదా ఇతర కారణాలు అడ్డు రావచ్చు. ఇటువంటి పరిస్థితులలో పార్టీ మారి పోటీ చేయడమే సరైన నిర్ణయమన్న భావన ఆయన అనుచరుల నుంచి వ్యక్తమవుతుంది. 1983లో తెలుగు దేశం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజక వర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించాడు. ఎన్‌టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు, కేసిఆర్ మంత్రి వర్గాల్లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ ఓటమికి కారణం పార్టీలో అంతర్గత విబేధాలేనని ఆనాడు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ తర్వాత తుమ్మల అప్పుడప్పుడు క్రీయాశీలక రాజకీయాల్లో పాల్గొంటూనే ఉన్నారు. గత జనవరిలో జరిగిన ఖమ్మం బహిరంగ సభకు కూడా తుమ్మలను ఇంటికెళ్లి రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఆహ్వానించారు. పాలేరు నియోజక వర్గం కేంద్రంగా తుమ్మల రాజకీయాలు నడుపుతూ వచ్చారు. తాను తప్పనిసరిగా పోటీ చేస్తానంటూ వివిధ వేదికల ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ సోమవారం నాడు కేసిఆర్ ప్రకటించిన జాబితాలో తుమ్మలకు స్థానం దక్కలేదు. కాంగ్రెస్ నుంచి చేరిన కందాళ ఉపేందర్‌రెడ్డికే అవకాశం ఇవ్వడంతో తుమ్మల వర్గం భగ్గుమంది. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని టిసివిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో సమావేశమైన వర్గీయులు తుమ్మల పార్టీ మారాల్సిందే నంటూ తీర్మానించారు. ఇది ఇలా ఉండగా రేవంత్‌రెడ్డి టిపిసిసి అధ్యక్షులైన తర్వాత తుమ్మలతో పలుమార్లు పార్టీ మార్పు విషయమై సంభాషించిన తుమ్మల ఏమాత్రం సానుకూలత ప్రకటించ లేదు. కేసిఆర్ పట్ల ఆయన విశ్వాసాన్నే ప్రకటించారు. కేసిఆర్ మాత్రం తుమ్మలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కనీసం చర్చించకుండా పాలేరు అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పుడు తుమ్మల చూపు కాంగ్రెస్ వైపు మళ్లీందన్న ప్రచారం జరుగుతుంది. క్రీయాశీలక రాజకీయాలను వదిలేయడమా లేక పార్టీ మారి తానేంటే నిరూపించుకోవడమా అన్న మీ మాంసలో తుమ్మల ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై అతి త్వరలోనే తుమ్మల నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఖమ్మంజిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు కూడా ఇక బిఆర్‌ఎస్‌తో నీకు కాలం చెల్లినట్లేనని, మార్పుపై ఆలోచించాలని సూచించారని తెలుస్తుంది. తుమ్మల నిర్ణయం ఉమ్మడి ఖమ్మంజిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
కాంగ్రెస్ వైపు తుమ్మల చూపు
RELATED ARTICLES