మణిపూర్‌లో హింసాకాండను పరోక్షంగా ప్రోత్సహిస్తున్న
బిజెపి సర్కార్
ఉద్యోగ, కార్మికుల ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/కొత్తగూడెం కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఉమ్మడి పౌరస్మృతి దేశ సమైక్యతకు ప్రమాదకరమని, అనేక జాతులు, అనేక భాషలతో కూడిన సమాహారమైన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగానికి వ్యతిరేకమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ భద్రాది జిల్లా కార్యాలయం శేషగిరిభవన్‌లో ఆదివారం జరిగిన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి జనరల్‌బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకోసం ప్రజల మధ్య విధ్వేశాలను రెచ్చగొట్టి బిజెపి ఓట్లు దండుకునేందుకు యుసిసిని ఉపయోగించుకుంటోందని, ఇది ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే తప్ప హిందువులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు ఎవరికీ మేలు జరగదన్నారు. మణిపూర్‌లో రెండు నెలలుగా గిరిజన తెగకు చెందిన మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్ సింగ్‌లు పట్టించుకోకుండా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. కుకి తెగకు చెందిన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం దేశానికే సిగ్గుచేటని, ఈ ఘటన జరిగి రెండు నెల లు గడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరుమెదపకుండా ఆరాచక శక్తులకు మతోన్మాద దాడులకు ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఈ దుశ్చర్యను భారత సమాజం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు కావస్తున్నా పేదవాడు మరింత పేదవాడుగా, ధనికుడు మరింత ధనవంతుడిగా మారిపోయారని, సమాజంలో అంతరాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. పేదవాడికి విద్య, వైద్యం, కూడు, నీడ, ఉపాధి అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పోరేట్ శక్తులకు అమ్మివేస్తున్నారని, ఆదాని, అంబానీ లాంటి వ్యక్తుల ఆస్తులను రెట్టింపుచేసే పనిలో మోడీ నిమగ్నమయ్యాడని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాలుమోపనివ్వమని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారంకోసం రెండో ఎఎన్‌ఎంలు,
అంగన్‌వాడీ సిబ్బంది, మిడ్డేమీల్స్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులతోపాటు ఇతర స్కీమ్ సిబ్బంది ఆందోళనల బాట పట్టారని, వీరి న్యాయమైన డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, ఇతర రంగాల కార్మికులు, ఉద్యోగులను గత హామీ మేరకు క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వేముల వెంకటేశ్వర్లు అధ్యతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వట్టికొండ మల్లికార్జున్‌రావు, వి.పూర్ణచందర్‌రావు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, జి.వీరస్వామి, వంగా వెంకట్, గెద్దాడు నగేష్, దీటి లక్ష్మిపతి, ఉప్పుశెట్టి రాహుల్, వి.పద్మజ, సంపూర్ణ, పోలమూరి శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, జర్పుల ఉపేందర్, మునిగడప పద్మ, పి.సత్యనారాయణచారి, గుగులోత్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి పౌరస్మృతిదేశ సమైక్యతకు ప్రమాదకరం
RELATED ARTICLES