HomeNewsBreaking News‘మణిపూర్‌' ఊసేలేదు

‘మణిపూర్‌’ ఊసేలేదు

అవిశ్వాస తీర్మాన చర్చకు సమాధానంలో ఆద్యంతం ప్రతిపక్షంపైనే ప్రధాని దాడి
విమర్శలు, గొప్పలతో లోక్‌సభలో మోడీ రాజకీయ ప్రసంగం
‘ఇండియా’ పక్షం వాకౌట్‌
మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాసం

న్యూఢిల్లీ : ‘ఇండియా’ కూటమి లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడోరోజు గురువారం చర్చ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమాధానం పేరుతో సభలో ఫక్తు రాజకీయ ప్రసంగం చేశారు. 90 నిమిషాల మోడీ ప్రసంగంలో ఆద్యంతం ప్రతిపక్షాలపై విమర్శలే తప్ప మణిపూర్‌లో శాంతిస్థాపనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరణ లేకుండానే పైపై ప్రకటనతో ప్రసంగం ముగించారు. కేంద్ర ప్రభుత్వం, మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంతి పునరుద్ధరణకు పనిచేస్తున్నామని, ఆ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఎంతమాత్రం సమ్మతంపదగినవి కాదని అన్నారు. మణిపూర్‌లో భరతమాతను ప్రభుత్వం హత్య చేసిందన రాహుల్‌గాంధీ బుధవారం చేసిన ప్రసంగ వాక్యాలను ప్రస్తావిస్తూ మోడీ తీవ్ర విమర్శలు చేశారు. తాను ఒక్కడినే ఈశాన్య రాష్ట్రాలలో 50 సార్లు పర్యటించానని, తన మంత్రివర్గ
సహచరులు 400 సార్లు ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించారని అన్నారు. మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదని తాజా సమస్య గురించి ప్రతిపక్షాలు అడుతున్న ప్రశ్నలపై ప్రధానమంత్రి పైవిధంగా స్పందించారు. కొంతమంది ఎందుకు భరతమాత మరణాన్ని కోరుకుంటున్నారో.. అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. ఈ విధమైన వ్యాఖ్యలు భారతదేశంలో ప్రతి భారతీయుడి భావోద్వేగాలను గాయపరచాయన్నారు. “వీళ్లంతా ప్రజాస్వామ్య హత్య, రాజ్యాంగ హత్య గురించి మాట్లాడుతున్నారు, ప్రజలకు ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం మూజువాణీ ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మణిపూర్‌ సమస్యపై ప్రధానమంత్రితో ఒక ప్రకటన చేయించడంకోసం, అవిశ్వాసం వంకతో మణిపూర్‌ సమస్యపై సభలో చర్చించడమే ప్రధాన లక్ష్యమని, మందబలం ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడే గద్దె దించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయలేదని ఇప్పటికే ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.
తమ ప్రభుత్వం మూడోసారి పరిపాలించే కాలంలోనే భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మోడీ చెప్పుకున్నారు. భారత్‌లోకి పెట్టుబడులు వరదలా ప్రవహించి వస్తున్నాయని ఎప్పటిలాగే ప్రకటనలు గుప్పించడంతోపాటు మణిపూర్‌లో హింసకు కాంగ్రెస్‌పార్టీయే కారణమని, కాంగ్రెస్‌ అవినీతిపార్టీ అనీ ప్రధానమంత్రి తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడోసారి కూడా ఎన్‌డిఎ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు దేశ ఆర్థిక కేంద్రాలుగా అవతరిస్తున్నాయని అన్నారు. అక్కడి శాంతి భద్రతల విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. హోంమంత్రి అమిత్‌ షా మణిపూర్‌లో శాంతి స్థాపనకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మోడీ ప్రసంగం ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుండి వాకైట్‌ చేశాయి. ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయ్యాక మూజువాణీ ఓటు ద్వారా అధికారపక్ష ఎంపిలు మోడీపై విశ్వాసం ప్రకటించారు. దేశ అభివృద్ధికి సంబంధిచిన అనేక బిల్లులపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు పార్లమెంటులో అడ్డం పడ్డాయని మోడీ తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. వారికి దేశం కంటే పార్టీయే ముఖ్యమని ఆరోపణలు చేశారు. ప్రజలు తమ ప్రభుత్వంపై ఇప్పటివరకూ అనేకసార్లు విశ్వాసం ప్రకటించారని, ఈసారి కూడా ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వల్ల తమకే మంచి జరుగుతుందని అంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు మరోసారి 2028లో కూడా అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశంలో ఎలాంటి అవినీతికి తావులేని పరిపాలన అందించడమే తమ ప్రభుత్వం ధ్యేయమని మోడీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌పార్టీనే ప్రధానంగా లక్ష్యం చేసుకుని మోడీ ఆద్యంతం తీవ్ర విమర్శలు గుప్పించారు.
బిఆర్‌ఎస్‌ ఎంపీలు సహా
ప్రతిపక్షాల వాకౌట్‌

అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుండి ప్రతిపక్ష ఎంపీలు అందరూ వాకౌట్‌ చేశారు. మోడీ 90 నిమిషాలు ప్రసంగించారు. మొదట ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించగానే ప్రతిపక్ష ఎంపీలు “మణిపూర్‌….మణిపూర్‌…మణిపూర్‌….” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మణిపూర్‌ సమస్యపై సమగ్రంగా సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ‘ఇండియా’ కూటమి ఎంపీలతోపాటు భారత రాష్ట్ర సమితి ఎంపీలు కూడా ప్రధానమంత్రి ప్రసంగిస్తుండగానే సభ నుండి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం సభ వెలుపల కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు, గృహ దహనాలు, అభద్రత గురించి చెప్పమని తాము ప్రధానమంత్రిని అడిగితే ఆయన ప్రతిపక్ష కూటమిపైనే తీవ్ర విమర్శలు గుప్పించి ప్రసంగం ముగించారని అన్నారు. “45 నిమిషాలసేపు ఆయన ప్రసంగం విన్న తరువాత కూడా ఆయన ఎక్కడా మణిపూర్‌ను ప్రస్తావించలేదు, ఆయన ఫక్తు రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారు.ప్రతిపక్షాలను తీవ్రంగా అవమానించారు, కాంగ్రెస్‌పార్టీపై చర్విత చరణంగా అవే విమర్శలు మళ్ళీ మళ్ళీ చేశారు, కానీ మణిపూర్‌ గురించి మాత్రం మాట్లాడలేదు, అవిశ్వాస తీర్మానంలో ‘ఇండియా’ కూటమి ఏ అంశాలనైతే ప్రస్తావించిందో ఆ ఆంశాలకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు” అని శశిథరూర్‌ విమర్శించారు. ఇది పూర్తిగా స్వచ్చమైన రాజకీయ ప్రసంగం, ఇందులో కొత్తదనం ఏముంది? దేశం గురించి, శాంతి భద్రతల గురించి ఏం మాట్లాడారని? దేశానికి ఆయన చెప్పిందేమిటి? ఆయన దేశానికి చెప్పిందేమిటో మాకు అర్థం కాలేదు, అవిశ్వాస తీర్మానం లక్ష్యం నెరవేరలేదు అని ఆయన విమర్శించారు. అసోంకు చెందిన ఎంపి, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష ఉప నాయకుడు గౌరవ్‌ గొగోయ్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. డిఎంకె ఎంపి టి.ఆర్‌.బాలు మాట్లాడుతూ, మణిపూర్‌లో హింస, శాంతి భద్రతల గురించి ప్రధానమంత్రి మాట్లాడతారని మేం ఆశించామని, కానీ ఆయన మా ఆశ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు కార్తీ చిదంబరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి సభకు రావడానికి తిరస్కరించినందువల్లనే తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి తాము సభకు రప్పించామని, కానీ ఆయన మణిపూర్‌పై మాట్లాడలేదని విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments