బాసుమతియేతర బియ్యంపై ఎగుమతులపై భారత్ నిషేధం
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అమెరికాలో స్టోర్లవద్ద ఎగబడ్డ ఇండియన్స్ : తొక్కిసలాట
న్యూఢిల్లీ : దేశం నుండి బాసుమతి యేతర సాధారణ రకం బియ్యం ఎగుమతులు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విదేశాలలో వైట్ రైస్ తినే ప్రవాస భారతీయులు సహా ఆసియా వాసుల్లో తీవ్ర కలవరం రేగింది. స్టోర్లలో తొక్కిసలాట జరిగింది. శుక్రవారంనాడు కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే బాసుమతి రకం బియ్యంతో సహా అన్ని రకాల సాధారణ బియ్యం బస్తాలు స్టోర్లలో ఖాళీ అయిపోయాయి. తొమ్మిది కేజీల బియ్యం బస్తా ప్రాంతాల వారీగా వివిధ పట్టణాలలో రూ.1,970 నుండి 2,770లు ధర పలికింది. ఈ నిర్ణయంతో థాయ్‌లాండ్, వియత్నాంలలో ఇప్పటికే నిల్వ చేసిన బియ్యం ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. బాసుమతి బియ్యం ఎగుమతులను మాత్రం ఈ నిషేధం నుండి మినహాయించారు. పారా బాయిల్డ్ బియ్యానికి కూడామినహాయింపు లభించింది. బాసుమతి యేతర బియ్యాన్ని దేశంలో ప్రజలకు అందుబాటులో ఉంచడంకోసమే ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరుగుతూ ఉండటంతో రిజర్వు బ్యాంకు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కాగా అమెరికాలో అన్నిరకాల బియ్యం ధరలూ పెరిగిపోయాయి. ఆసియా వాసులు ప్రధానంగా ఎక్కడ ఉన్నా బియ్యమే ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. ఎగుమతులు నిషేధించారన్న వార్త వ్యాప్తి చెందనే ఆసియా వాసులు గ్రోసరీ స్టోర్లకు పరుగులు తీశారు. దీంతో బియ్యం విక్రయించే స్టోర్లు అన్నీ గుంపులతో కిటకిటలాడాయి. ఒక్కసాగా పెద్ద సంఖ్యలో ఆసియా కొనుగోలుదారులు గ్రోసరీలపై దాడి చేయడంతో కంగుతిన్న విక్రేతలు ఇండియన్ ప్రోడక్ట్ ధరలను అమాంతం మరింత పెంచేశారు. ఉదాహరణకు ఓహియోలోని మాన్సన్ పట్టణంలోని గ్రోసరీలలో స్టాక్ తక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. 9.07 కేజీల సాధారణ రకం బియ్యం బస్తా 24 డాలర్లు (సుమారు 1,970 రూపాయలు) ధర పలికింది. బాసుమతి బియ్యం ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేకపోయినప్పటికీ వాటి స్టాక్ కూడా దుకాణాలలో ఖాళీ అయిపోయింది. బాసుమతి బియ్యం ధరలు కూడా పెంచేశారు. మేజర్ బ్రాండెడ్ బియ్యం ఉత్పత్తుల కోసం ఆసియావాసులమధ్య తొక్కిసలట జరిగింది. బియ్యం ఎగుమతులకు ముందునుండే భారతదేశంలో గోధుమల ఎగుమతులపై నిషేధం ఉత్తర్వులు కొనసాగుతూ ఉండటంతో అమెరికాలో భారత్ ఉత్పత్తుల ధరలు 11 శాతం మేరకు పెరిగిపోయాయి. ఇప్పుడు మరింత పెరిగాయి. మాసన్‌లో ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారి ఇచ్చిన సమాచారం ప్రకారం, దీర్ఘకాలంగా ఆయన స్టోరులో ఉన్న బియ్యం నిల్వలు అన్నీ కొది గంటలలోనే కొనుగోలుదారులు ఎగరేసుకుపోయారు. అదేవిధంగా టెక్సాస్ వంటి పలు రాష్ట్రాలలో భారీ సంఖ్యలో ఆసియా ప్రజలు నివసిస్తూ ఉండటంతో అక్కడి స్టోర్లలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భారత్ ఇదేవిధంగా మూడు సంవత్సరాల క్రితం కూడా బియ్యం ఎగుమతిపై నిషేధం విధించినప్పుడు చాలా కష్టాలు పడ్డామని ఆసియావాసులు చెబుతుండగా, వ్యాపారులు కూడా ఆనాటి పరిస్థితే ఇప్పుడూ వచ్చిందని పేర్కొన్నారు. అయితే నిషేధ ఉత్తర్వులకు ముందుగా బయలుదేరి వెళ్ళపోయిన బియ్యం ఎగుమతులన్నీ ఓడరేవుల్లో అలాగే ఉండిపోయాయి. వాటిని ఎగుమతిదారులు ఇంకా క్లియర్ చేయవలసి ఉంది. వాటి ధరలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ళక్రితం భారత్ గోధుమ పిండి ఎగుమతులపై నిషేధం విధించినప్పుడు తీవ్రమైన తొక్కిసలాటలు జరిగాయి. నిషేధం వల్ల విదేశాలలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతాయని అంచనావేస్తున్నట్లు ఎగుమతిదారులు చెప్పారు. ఉక్రేన్‌లో యుద్ధం కారణంగా యూరప్‌లో, అమెరికాలో ఇప్పటికే ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆఫ్రికా దేశాలలో, చైనా, థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్ దేశాలలో భారత్ బియ్యం సరఫరాలు అత్యధికంగా ఉంటాయి.
ప్రవాస భారతీయులబియ్యం కష్టాలు
RELATED ARTICLES