HomeNewsBreaking Newsఇంకా జలవిలయంలోనే

ఇంకా జలవిలయంలోనే

న్యూఢిల్లీ : ఉత్తరభారతంలో జలవిలయం కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి. వరదల్లో కార్లు కొట్టుకుపోగా, రహదారులు ధ్వంసమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. అయితే సోమవారం కూడా ఢిల్లీ, హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, జమ్ముకశ్మీర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ప్రత్యేకించి హిమాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. మరో ఐదుగురు మృత్యువాత పడ్డారు. 200 మందికిపైగా చిక్కుకుపోయారు. ప్రధాని నరేంద్రమోడీ సీనియర్‌ మంత్రులు, అధికారులకు ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీలోని యమునా నది సహా ఉత్తర భారతంలోని అనేక నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రీజియన్‌ వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో అనేక రోడ్లు ధ్వంసం కాగా, నివాస ప్రాంతాల్లో మొకళ్ల లోతు వరద చేరింది. కుండపోత వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు పిఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి అదనపు సాయం అందించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం కేంద్రాన్ని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీనియర్‌ మంత్రులు, అధికారులతో ప్రధాని ఫోన్‌ మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్లు పిఎంఒ తెలిపింది. స్థానిక అధికార యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయని తెలిపింది. కొండప్రాంత రాష్ర్టమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో వరుసగా మూడవ రోజు సోమవారం కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి సిమ్లాలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సిమ్లా రహదారి మూసుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షం సంబంధిత ఘటనలకు 16 లేదా 17 మంది మృతి చెందినట్లు సిఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తెలిపారు. పర్యాటక పట్టణమైన మనాలీలో చిక్కుకున్న 20 మందిని కాపాడామని, అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 200 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. తియోగ్‌ సబ్‌డివిజన్‌లో కొండచరియలు విరిగిపడి ఓ ఇళ్లపై పడడంతో ముగ్గురు మృతి చెందారన్నారు. హిమాచల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం ఉదయం వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. కొండచరియలు విరిగి ట్రాక్‌పై పడడంతో సిమ్లా మార్గంలో రైళ్ల రాకపోకలు మంగళవారం వరకు రద్దు చేశారు. సోమ, మంగళవారాల్లో విద్యాసంస్థలు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అదే విధంగా కొండచరియలు విరిగిపడడంతో సిమ్లా కల్కా జాతీయ రహదారి శోంఘి సమీపంలో దిగ్బంధనానికి గురైంది. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సిఎం సుఖుతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ర్టంలో సంభవించిన మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖర్గే ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో కురుస్తున్న కుంభవృష్టి, యమునా నదిలో పెరుగుతున్న వరద ఉధృతిపై అధికారులతో సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యమునా నదిలో నీటిమట్టం 206 మీటర్ల మార్క్‌కు చేరగానే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలిస్తామన్నారు. అయితే మయునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నప్పటికీ దేశ రాజధానిలో వరదల పెద్దగా ఉండవని నిఫుణులు చెప్పారన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిగా సంసిద్ధమై ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు. భారీ వర్షాల కారణంగా హతనికుంద్‌ బ్యారేజ్‌ నుంచి హర్యానా మరింతగా నీటిని విడుదల చేసింది. దీంతో యమునా నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 16 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌, బోట్లను అందుబాటులో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు యమునా నది నీటిమట్టం 204.88 మీటర్లు దాటినట్లుగా అధికారులు తెలిపారు. నీటిమట్టం 205.33 మీటర్లు దాటితే గనుక దానిని అతి ప్రమాదకరంగా భావిస్తారు. ఇప్పటివరకు 2,13,679 క్యూసెక్కుల నీటిని హత్నికుంద్‌ బ్యారేజ్‌కు విడుదల చేశారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా నదులు ఉప్పొంగే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంజాబ్‌, హర్యానాలోనూ సోమవారం భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈనెల 13వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని పంజాబ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చండీగఢ్‌లోనూ గత మూడు రోజుల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు చెందవద్దని పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రల్లోని మోహలీ, పాటియాల, రూప్‌నగర్‌, ఫతేగఢ్‌ సాహిబ్‌, పంచకుల, అంబాల జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. కుంభవృష్టి వర్షాలకు వరదల పోటెత్తుతుండడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ముందస్తు షెడ్యూళ్లను రద్దు చేసుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments