HomeNewsBreaking Newsఉత్తరాదిన కుంభవృష్టి

ఉత్తరాదిన కుంభవృష్టి

భారీ వర్షాలకు పలు రాష్ట్రాలు విలవిల
కొండచరియలు విరిగిపడి, వర్షం సంబంధిత ఘటనలకు 15 మంది మృత్యువాత
ఢిల్లీలో 40 ఏళ్ల రికార్టు బ్రేక్‌
ఒక్కరోజే నగరంలో 153 మి.మీ. వర్షపాతం నమోదు
హిమాచల్‌లో రెడ్‌ అలర్ట్‌
న్యూఢిల్లీ :
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్నాయి. కొండచరియులు విరిగిపడి, వర్షం సంబంధిత ఘటనలకు మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిలీలోని యమునా సహా అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. ఉత్తర రైల్వే 17 రైళ్లనురద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. రానున్న రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. శనివారం దేశ రాజధానిలో అతి భారీ వర్షాలు కురిశాయి. సీజన్‌ ప్రారంభం తరువాత భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని ఐఎండి చెప్పింది. వరదల పోటెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో నగరంలో 153 మి.మీ. వర్షపాతం నమోదైంది. 1982 నుంచి హస్తినలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు తెలిపారు. ప్రగతి మైదాన్‌, నెహ్రూ నగర్‌, పంచశీల మార్గ్‌, కల్కాజీ, ఐటిఒ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో శనివారం నుంచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు రోడ్డుపైకి చేరడానికి ఢిల్లీలో మురుగు కాలువల వ్యవస్థ సరిగా లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ.. ఢిల్లీలో వర్షం, దానివల్ల తలెత్తిన ఇబ్బందులపై నగర వాసులు సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు పెట్టారు. మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. మరో రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లో అలర్టెను జారీ చేసింది. ఢిల్లీలో ఓ ఫ్లాట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడి పడడంతో 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. రాజస్థాన్‌లో వర్షం సంబంధిత ఘటనలకు నలుగురు ప్రాణాలు
కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇళ్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ, ఆరేళ్ల కూతురు మృత్యువాత పడ్డారు. హిమచల్‌లోనూ ఇళ్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, కొండచరియలు విరిగిపడడంతో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇళ్లు ధ్వంసమైంది. దీంతో ఇంట్లో నివసిస్తున్న మహిళ చనిపోయింది. మరో చోట శిథిలాలు మీదపడ ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యాడు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. వరదల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. వరదల తాకిడికి ఎన్‌హెచ్‌ 44 పలుచోట్ల ధ్వంసమైంది. దోడా ప్రాంతంలో బస్సుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
హిమాచల్‌లో విరిగిపడిన కొండచరియలు
హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. అసలే కొండ ప్రాంతం కావడం వల్ల వర్షాలకు వరదలు పోటెత్తాయి. కుల్లులో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. బియాస్‌ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బియాస్‌ నదిలో ప్రవాహం భారీగా పెరగడం వల్ల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సిమ్లా, సిర్మౌర్‌, లాహౌల్‌ స్పితి, చంబా, సొలన్‌ జిల్లాలో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం సంబంధింత ఘటనల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 12 జిల్లాలకు గానూ 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆ జిల్లాలకు ఐఎండి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గత 36 గంటల్లో 14 చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడగా, 13 సార్లు వరదలు పోటెత్తాయి. 700 రోడ్లను మూసివేశారు. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అటల్‌ టన్నెల్‌కు కిలోమీటరు దూరంలో టైలింగ్‌ నాలా వరద కారణంగా.. మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఉదయ్‌పుర్‌లోని మద్రంగ్‌ నాలా, కాలా నాలా వరదలతో పలు రోడ్లను మూసివేశారు. మండీ జిల్లాలో ఔట్‌ బంజార్‌ ప్రాంతాలను కలుపుతూ బియాస్‌ నదిపై నిర్మించిన ఓ ఉక్కు వంతెన సైతం వరద ధాటికి కొట్టుకుపోయింది. సొలన్‌ జిల్లా కసౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. జిల్లా యంత్రాంగం.. నిర్మాణ రంగ కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
పంజాబ్‌, హర్యానాలో వర్ష బీభత్సం
పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పెద్ద ఎత్తున వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్ష ప్రభావిత జిల్లా పర్యటించి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌ మంత్రులు, అధికారులను ఆదేశించారు. వరుసగా రెండవ రోజు కూడా పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌, మోహలి, రూప్‌నగర్‌, పాటియాలలో, హర్యానాలోని పంచుకుల, యమునానగర్‌, అంబాలా, కర్నల్‌, కురుక్షేత్ర, సోనిపట్‌, ఇతర ప్రాతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షా కారణంగా రెండు రాష్ట్రాలను అనుసంధానించే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌లో ఆదివారం ఉదయం 8.30 గంటల నాటికి గత 24 గంటల్లో 302.2 మి. మీ. వర్ష పాతం నమోదైంది.
ఉత్తరాఖండ్‌లో హైఅలర్ట్‌
ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు మృతి చెందారు. దీంతో కొండ ప్రాంత రాష్ట్రానికి అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రంలోన్ని అన్ని ప్రధాన నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల కొండచరియులు విరిగిపడడంతో అనేక రోడ్లు దిగ్భంధనానికి గురయ్యాయి. కేదార్‌నాథ్‌ నుంచి 11 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి గంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురుని రక్షించినట్లు ఎస్‌డిఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కవంద్ర సజ్‌వాన్‌ తెలిపారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. బాధితుల్లో ఢిల్లీ, బీహార్‌, హైదరాబాద్‌కు చెందిన వారున్నారు.
రాజస్థాన్‌లో 9 జిల్లాల్లో భారీ వర్షాలు
రాజస్థాన్‌లోని 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు ఐఎండి తెలిపింది. రాజ్‌సమండ్‌, జాలోర్‌, పాలి, అజ్మీర్‌, అల్వార్‌, బనస్వారా, భరత్‌పూర్‌, భిల్వారా, బండి, చిత్తోర్‌గఢ్‌, దౌసా, దౌల్‌పూర్‌, జైపూర్‌, కోటాలో భారీ వర్షాలు కురిశాయి.
కేరళ, కర్నాటకలోనూ వర్షాలు
దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్నాటకలోనూ కేరళలో నాలుగు జిల్లాలు కోజికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, కాసర్‌గడ్‌లకు ఐఎండి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments