ఆ రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం ఒక రాజకీయ సమస్య
పరిష్కారం కూడా రాజకీయంగానే చేయాలి
ప్రజాస్వామ్య, లౌకికశక్తుల ఐక్య ఉద్యమంతోనే ప్రజావ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న పాలకులకు చరమగీతం
ఎఐవైఎఫ్ జాతీయ వర్క్‌షాప్‌లో రెండోరోజు రాజ్యసభ ఎంపి పి.సంతోష్‌కుమార్ ఉద్ఘాటన
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న పాలకులను గద్దె దించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని రాజ్యసభ సభ్యులు,ఎ ఐ వై ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. సంతోష్ కుమార్ అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎ ఐ వై ఎఫ్) జాతీయ వర్క్ షాప్ రెండవ రోజు సెషన్ హిమాయత్ నగర్ లోని సత్య నారాయణ రెడ్డి భవన్‌లో ఆదివారం జరిగింది. ఈ సెషన్‌కు సంతోష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తూ ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న సంక్షోభం ఒక రాజకీయ సమస్య అని, దీనికి పరిష్కారం కూడా రాజకీయంగానే చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే హింసను ఆపాలని, శాంతిని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. మణిపూర్‌లో పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం అనుసరించిన రాజకీయాల కారణంగా వివిధ జాతుల మధ్య హింస జరిగిందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పుకునే బిజెపి ప్రభుత్వం అనుసరించిన ప్రజల విభజన విధానంతోనే మణిపూర్ లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజల మధ్య విభజనకు పాల్పడడంతో వారి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకుగాను ప్రజల మధ్య చీలికలు ఏర్పడ్డాయని ఉద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌లోని అన్ని రాజకీయ పార్టీలను తక్షణం సమావేశపరచాలన్నారు. నిర్వాసితులైన వేలాదిమందికి తక్షణమే ప్రత్యేక ప్యాకేజీని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మణిపూర్‌లో టెర్రరిస్టు చర్యలను తక్షణం నిలిపివేయాలని,అనేక సమస్యలను పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని , ఇక్కడ చోటుచేసుకున్న హింసాయుత ఘర్షణ రాజకీయ,సామాజిక పరమైందని, కేవలం శాంతిభద్రతల సమస్యకాదని స్పష్టం చేశారు.ఈ హింసాకాండలో బాధితులను, హింసకు బాధ్యులైన వారి ప్రతినిధులను, రాజకీయ పార్టీలను తక్షణం సంప్రదించి, ప్రజల మధ్య ఏర్పడిన వైరుధ్యాలను, విద్వేషాలను రూపుమాపాలని. అందరి అభిప్రాయాలను తెలుసుకుని సంక్షోభానికి రాజకీయపరమైన పరిష్కారాన్ని కనుగొని ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.తద్వారా రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని, శాంతిని నెలకొల్పాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలన్నారు.ప్రపంచ శాంతి దూతగా అభివర్ణించుకునే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాణిపూర్‌లో శాంతిని నెలకొల్పడానికి ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రశాంత మాణిపూర్ లో విద్వేషాలు రెచ్చగొట్టారో ప్రజలకు మోడీ వివరించాలని సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.ఎ ఐ వై ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సుఖేందర్ మహేసరి, తిరుమలై రామన్ మాట్లాడుతూ కార్పొరేట్, మతోన్మాదశక్తులు అధికారంలో ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, డిజిటలీకరణ వంటి అంశాలతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. మన హక్కులు,ప్రజల భవిష్యత్ కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ఎ ఐ వై ఎఫ్ సైద్ధాంతిక అవగాహన కలిగిన భౌతిక సంఘమన్నారు. కాగా వర్క్ షాప్ లో ‘కులం, మతం – సామాజిక న్యాయం’ అనే అంశంపై అల్ ఇండియా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సభ్యులు యుగల్ రాయులు, సోషల్ మీడియాలో యువజన సంఘ పాత్ర అనే అంశంపై అల్ ఇండియా సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ సభ్యులు దినేష్ రఘునాథ్ బోధించారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ వై ఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ టిటి. జిస్మాన్, లెనిన్ బాబు, అరుణ్, విక్కీ, హరీష్‌బాల, భారతి, కరంవీర్ కౌర్, ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, లింగం రవి, యుగంధర్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సల్మాన్ బైగ్, టి. సత్య ప్రసాద్ లతో పాటు 23 రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు
బిజెపి విభజన విధానంతోనేమణిపూర్‌లో కల్లోలం
RELATED ARTICLES