‘ఏటా రైతుపై నకిలీ పోటు
దిగుబడిపై తీవ్ర ప్రభావం
నష్టపోతున్న అన్నదాత
ప్రజాపక్షం/ ఖమ్మం నకిలీ విత్తనాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇది ఈ ఏడాది కొత్తగా వచ్చిందేమీ కాదు… ప్రతి ఏటా నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. కానీ నకిలీ విత్తనాల బారీనపడి రైతాంగం నష్టపోతూనే ఉంది. గతంలో నకిలీలు వాణిజ్య పంటలకే పరిమితం అనుకుంటే ఇప్పుడు ఆహార పంటలకు సంబంధించి కూడా నకిలీ విత్తనాలు తయారవుతున్నాయి. ముఖ్యం గా మిర్చి, పత్తి, వరి నకిలీ విత్తనాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. పెట్టుబడులు పూర్తి చేసి తీరా పంట చేతికొచ్చే దశలో పూత, కాత లేకుండాపోవడం తెగుళ్ల బారినపడి ఎదుగు బొదుగు లేకపోవడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టిన తర్వాత పంట దిగుబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. గత దశాబ్ద కాలంగా నకిలీలపై ఉక్కుపాదం అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. నష్టపోయే రైతులు నష్టపోతూనే ఉన్నా రు. డీలర్లు నకిలీ విత్తనాలను అమ్మరాదంటూ…. అమ్మి తే పిడియాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు జరుగుతున్నా అమ్మకాలు ఆగడం లేదు. ముఖ్యంగా సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాల జోరు ఎక్కువగా ఉంటుంది. రైతులు కోరుకునే విత్తనాలు డీలర్ల వద్ద లభ్యం కాకపోవడంతో దళారులను రైతులు ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువ ధరకు విత్తనాలు లభిస్తే వాటిని రైతులు కొనుగోలు చేయడంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. దానిని అరికట్టకుండా డీలర్ల చుట్టూ పోలీసులు మోహరించడం వల్ల అంతగా ఫలితం ఉండక పోవచ్చు. వ్యవసాయ అధికారులు రైతులను ఆ దిశగా వెళ్లి నకిలీల బారీనపడకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలి. వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న ప్రస్తుత తరుణంలో గ్రామాల వారీగా రైతులను సమావేశపరిచి నకిలీ విత్తనాల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించడంతో పాటు అధీకృత డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి పంట నష్టపోతే వచ్చే నష్ట పరిహారం గురించి తెలియజేయాల్సి ఉంది. రశీదులను జాగ్రత్త పరిచి పంట విత్తనాల కారణంగా నష్టపోయిన లేదా మరోరకంగా రైతుకు నష్టం వాటిల్లిన డీలర్ల ద్వారా పరిహారం పొందవచ్చునని లేదంటే న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించవచ్చునన్న విషయాన్ని రైతులకు తెలియపరిచి చైతన్యవంతులను చేయాలి. ప్రభుత్వం ఆమోదం పొందిన విత్తన దుకాణాల్లో కూడా రశీదులు లేకుండా రైతులు కొనుగోళ్లు చేస్తే ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని కూడా ప్రతి రైతుకు తెలియజేయాల్సి ఉంది. విత్తన కొనుగోలుకు సంబంధించి అతికొద్ది మొత్తానికి ఆశపడి దళారులను నమ్మితే ఏడాది పంటంతా రైతాంగం నష్ట పోవాల్సి వస్తుంది. ఖమ్మంజిల్లాలో ప్రతి ఏటా సుమారు 10 వేల ఎకరాల వరి, మిర్చి, పత్తి పంటలను రైతులు నష్టపోతున్నారు. విత్తన కొనుగోళ్లకు సంబంధించి అవగాహన లేకపోవడం, తక్కువ ధరకు వస్తుందన్న భావన ఈ నష్టాలకు కారణమవుతుంది. కల్తీ విత్తన విషయం మొత్తం పెట్టుబడులు పెట్టిన తర్వాత బహిర్గతమవుతుంది. ఈ విషయాన్ని రైతాంగం నిరంతరం మననం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం విత్తన డీలర్లే కాదు రైతులను చైతన్య పర్చకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితాలు రాక పోగా పాత కథే పునరావృతమయ్యే అవకాశం ఉంది. నకిలీ విత్తనాల వ్యవహారానికి ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నారో అదే పద్ధతిలో వ్యవసాయ అధికారులను కార్యోన్ముఖులను చేసి గ్రామ గ్రామాన రైతులకు విత్తన కొనుగోలు సందేశాన్ని అందించాల్సి ఉంది. ఇదే సందర్భంలో వ్యవసాయ ప్రణాళికకు సంబంధించి రైతులు ఏమి పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకోవడమే కాకుండా ప్రస్తుత వాతావరణంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఎలా పొందవచ్చో రైతులకు వివరించాల్సి ఉంది. గతేడాది ఏ పంట లాభ సాటిగా ఉంటే మరుసటి ఏడాది రైతులందరూ అదే పంటను సాగు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఒక ఏడాది పండింది మరో ఏడాది అంతగా దిగుబడి రాకపోవచ్చు. ఇప్పటికి 65 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. గడచిన ఐదేండ్లుగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడుల్లో వచ్చే అంతరాలు రైతాంగాన్ని నష్టపర్చడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతుంది. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, రైతాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత, నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు రైతులను కార్యోన్ముఖులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రకటనలకు పరిమితం కాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి పనిచేయాలని రైతాంగం కోరుకుంటుంది.
నకిలీ’ కట్టడయ్యేనా..!
RELATED ARTICLES