పెద్ద నోట్ల రద్దుపై కూనంనేని విమర్శ
పోడు రైతు గోసను పట్టించుకోవాలి
‘ప్రజాగర్జన’ సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపు
ప్రజాపక్షం/ పాల్వంచ ప్రజలను మభ్యపెట్టేందుకే మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని, ఇప్పుడు మోసం చేసేందుకు రద్దు తాత్కాలికమే అని అంటున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతుతూ…అవినీతిపరులు, అక్రమార్కులకు బిజెపి అండగా నిలుస్తుందన్నారు. జూన్ 4వ తేదీన జరిగే సిపిఐ ‘ప్రజాగర్జన’ సభ విజయవంతం కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కూనంనేని మంగళవారం విస్తృతంగా పర్యటించారు. చంద్రాలగూడెం, రేగులగూడెం, లక్ష్మీదేవిపల్లి సహా పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ చోట్ల నిర్వహించిన సమావేశాల్లో కూనంనేని మాట్లాడుతూ బిజెపి పాలనలో ప్రజల్లో ఆభద్రతా భావం నెలకొందని, ప్రజలందరూ ఏకమై కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీని గద్దెదించి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 2.99 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించిన కెసిఆర్ ఆ ప్రక్రియను వేగవంతం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్వేలతో కాలం వెళ్లదీయడం సరి కాదని కూనంనేని సూచించారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏళ్లు గడుస్తున్నా సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా తీసుకుని ప్రజాగర్జన సభను నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు. సిపిఐ ప్రజా గర్జన సభకు జాతీయ కార్యదర్శి డి. రాజాతో పాటు పలువురు జాతీయ రాష్ట నాయకులు పాల్గొంటారని ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కూనంనేని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, నాయకులు వి. పూర్ణచందర్‌రావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, ఎ. వెంకటేశ్వర్లు, శ్రీను, రాజు, వేముల పల్లి శ్రీను, ఎండి పాషా, రాందాస్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే…
RELATED ARTICLES