HomeNewsBreaking Newsజాతీయ రాజకీయాల్లోఎన్‌టిఆర్‌ది ముఖ్యభూమిక

జాతీయ రాజకీయాల్లోఎన్‌టిఆర్‌ది ముఖ్యభూమిక

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా ఎన్‌టిఆర్‌ నాడు జాతీయ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషించారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు పేదలు, బాధితుల బాధలను అర్థంచేసుకుని, వారికి అనుకూల విధానాలను, పాలనను అందించిన వ్యక్తి ఎన్‌టిఆర్‌ అని గుర్తు చేశారు. ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో శనివారం జరిగాయి. ఈ ఉత్సవాలకు డి.రాజా విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ఎన్‌టిఆర్‌ ఒక సున్నితమైన రాజకీయ నాయకుడని, గొప్పమానవతావాది అని అన్నారు. పేదల అనుకూల పాలనను అందించారని, పేదల ఆకలిని అర్థం చేసుకుని రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎన్‌టిఆర్‌ తెలుగు రాష్ట్రాలకే కాదని, జాతీయ స్థాయి నాయకనిగా ఎదిగారన్నారు. తాను యువకునిగా ఉన్నప్పుడు కర్ణన్‌ సినిమా చూశానని, ఇందులో ఎన్‌టిఆర్‌ కృష్ణుని పాత్రను పోషిస్తే, శివాజీ గణేష్‌ కర్ణుని పాత్రను పోషించారని, ఎన్‌టిఆర్‌ది అద్భుతమైన నటన అని కొనియాడారు. ఆ సినిమా తర్వాత కృష్ణుని అంశం వచ్చినప్పుడు తనకు ఎన్‌టిఆర్‌ పాత్రనే గుర్తుకొచ్చేదన్నారు. సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ రాజకీయ రంగంలో ఎన్‌టిఆర్‌ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్‌టిఆర్‌ రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కృషి చేశారన్నారు. దేవుని ప్రస్తావన వస్తే తనకు ఎన్‌టిఆర్‌ రూపమే గుర్తుకొస్తుందన్నారు. నాడు టిడిపి ప్రభుత్వాన్ని నిరంకుశంగా రద్దు చేస్తే ఢిల్లీలో రాష్ట్రపతి ఎదురుగా తన బలాన్ని నిరూపించుకున్నారని, ఆ సమయంలో తమ పార్టీ వారికి తగిన సహాయం చేశామన్నారు. శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తొలుత ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులు జ్యోతిప్రజ్వల చేశారు. అనంతరం ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ వేడుకల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ సిఎం నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాల కృష్ణ, భువనేశ్వరి, పురంధేశ్వరి, వసుంధర, లోకేశ్వరి, బ్రహ్మాణి నందమూరి కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు శివరాజ్‌ కుమార్‌, విక్టరీ వెంకటేశ్‌, మురళీమోహన్‌, బాబుమోహన్‌, జయసుధ, మెగాహిరో రామ్‌చరణ్‌, అల్లుఅరవింద్‌, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వినిదత్‌, దర్శకులు బోయపాటితో పాటు టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, నాయకులు పి.సాయిబాబు, కాసాని వీరేష్‌ సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పలువురు నివాళ్లు అర్పించారు. అనంతరం “శకపురుషుడు ” అనే పుస్తకాన్ని బండారు దత్రాత్రేయ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదటి కాపీని నందమూరి బాలకృష్ణకు అందజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments