HomeNewsBreaking Newsవీడని వర్షాలు

వీడని వర్షాలు

కొనుగోలు కేంద్రాలు, కల్లాలు జలమయం .. రైతులు దిగాలు
ప్రజాపక్షం న్యూస్‌ నెట్‌వర్క్‌

రాష్ట్రాన్ని వర్షాలు వీడడంలేదు. అకాల వానలకు అన్నదాతలు కకావికలమవుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వడగండ్ల, ఈదురుగాలులతో కూడిన వానలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఒక వైపు పొలాల్లో చేతికొచ్చిన పంటలు నష్టపోతుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులను నిల్వచేసేందుకు తగిన సదుపాయాలు లేకపోవడంతో కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షాలకు నిండా మునుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, మెదక్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండ తదితర జిల్లాల్లో గత కొద్ది రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురియడంతో చేతికి వచ్చిన వేలాది ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు నేలరాలుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో కల్లాల్లో, మార్కెట్‌ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ చేసిన వరి ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల జోరు వానకు ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు దిగాలుమంటున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిమ్మకు నీరెత్తినుట్ల జరుగుతుండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి దానిని సురక్షితంగా రతలించాలని కోరుతున్నారు.
శాలిగౌరారంలో జలమయమైన కొనుగోలు కేంద్రం
శాలిగౌరారం: నల్లగొండ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలలో రెండు రోజులుగా లారీలు రాకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. శాలిగౌరారం మండల పరిధిలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. గత రెండు రోజులలో కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టినందుకు రైతులు నానా అవస్థలు పడుతున్న తరుణంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి అడ్లూరు గ్రామంలోని కొనుగోలు కేంద్రం జలమయమైంది. ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలకులారీలు వచ్చి ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని అడ్లూరు గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్‌ చిత్తూరు వెంకన్న కోరుతున్నారు. మండలంలోని అగ్రికల్చర్‌, రెవెన్యూ అధికారులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో మూడు రోజులు భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్లు కుస్తాయని అధికారులు చెప్పారు. మిగతా పాంత్రాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వాతావరణ పరిస్థితులను దృష్ట్యా ఎల్లో అలెర్ట్‌ జారీ చేశామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments