ప్రజా సమస్యలపై పాలకులకు పట్టింపు లేదు
తాండూర్‌లో సిపిఐ ప్రజా పోరు యాత్ర ప్రారంభోత్సవంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ
ప్రజాపక్షం/ మంచిర్యాల ప్రతినిధి దేశంలో నిరుద్యోగం, ఆకలి చావులు, మతోన్మాద దాడులు, ప్రైవేటీకరణ, ప్రజా, కార్మిక, కర్షక, యువత, విద్యార్థి వ్యతిరేక పాలన సాగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని ఐబి చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రేగుంట చంద్రశేఖర్ నేతృత్వంలో చేపట్టిన సిపిఐ ప్రజా పోరుయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల బతుకులను అస్తవ్యస్థం చేసిందని, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అనేక మంది బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిత్యం నిరుద్యోగ సమస్య పెరుగుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారన్నారు. ఉద్యోగులను, కార్మికులను బానిసలుగా చేసేందుకు చట్టాలను రద్దు చేసి కార్మిక లేబర్ కోడ్‌లను రూపొందించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. చాప కింద నీరులా మతోన్మాద శక్తులు దేశంలో రాజ్యమేలాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రజలు పోరాటాలకు సిద్దంగా ఉండాలన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
వేలాది మందికి ఉపాధిని కల్పిస్తూ దశాబ్ద కాలంగా లాభాల్లో కొనసాగుతున్న సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని కలవేన శంకర్ విమర్శించారు. సింగరేణి సంస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసేందకు చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు సిపిఐ ఆధ్వర్యంలో దశల వారిగా ఉద్యమాలు చేపడతామని, ఎట్టిపరిస్థితుల్లో సింగరేణి ప్రైవేటీకరణ కానివ్వబోమని తెలిపారు. సిపిఐ ప్రజా పోరు యాత్ర బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలో మొదలై జిల్లా కేంద్రం వరకు సాగుతుందని, బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి యాత్ర చేపడతామన్నారు. తాండూర్‌లో మంగళవారం మొదలైన పోరుయాత్ర మే 17వ తేదీ వరకు జిల్లాలో కొనసాగుతుందని, ఈ పోరు యాత్రలో ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజలు, కార్మికులు, కర్షకులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక పాలననుసమాధి చేద్దాం
RELATED ARTICLES