HomeNewsBreaking Newsఓటుకోసమే జనంవద్దకు నేతలు

ఓటుకోసమే జనంవద్దకు నేతలు

సమస్యలున్నచోటే కమ్యూనిస్టులు
ప్రజా చైతన్యయాత్రలో చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/సిద్దిపేట ప్రతినిధి
రాజ్యాంగం కల్పించిన ఓటు కోసం ప్రజల వద్దకు నాయకులు వస్తున్నారని, లేకుంటే ఎవ్వరు కూడా ప్రజల వద్దకు వచ్చేవారు కాదని, ప్రజాప్రతినిధులు పేదలను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ పేదలు, కార్మికుల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. ‘ఇంటింటికి సిపిఐ’ ప్రజా పోరుయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ప్రజ్ఞాపూర్‌ నుండి గజ్వేల్‌ వరకు
భారీ ర్యాలీ నిర్వహించారు. చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద వపన్‌ల ఆధ్వర్యంలో సిపిఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొద్ది సేపు పాదయాత్ర తర్వాత బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గజ్వేల్‌ ముట్రాజ్‌పల్లి అంబేద్కర్‌ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో చాడ వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రధాని మోడీ ఏ ఒక్కటీ అమలు చేయలేదని చాడ విమర్శించారు. మోడీ, అమిత్‌ షాలు మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లడబ్బు తెచ్చి పేద ప్రజల ఆకౌంట్లలో వేస్తారని నమ్మబలికారని, కానీ ఒక్క పైసా వేయలేదన్నారు. ప్రతి యేట 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారని, దానిని కూడా అమలు చేయలేదన్నారు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాన్ని మాత్రం అమలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్న మోడీ సర్కార్‌ రైతులకు రుణాలు మాత్రం మాఫీ చేయడంలేదని విమర్శించారు. ప్రధాని మోడీని ఇంటిని పంపించే వరకు కలిసివచ్చే లౌకిక శక్తులతో కలసి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సంగేం మధు, జెర్రిపోతుల జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.
చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేయాలి
మద్దూరు/కొమురవెళ్లి :
చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని, వారి కోరికపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పందించి వెంటనే రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించాలని చాడ వెంకట్‌రెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా మద్దురు, చేర్యాల, కోమురవెళ్లి మండలాల్లో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్యయాత్ర విజయవంతంగా కొనసాగింది. సిపిఐ నేత చాడ వెంకట్‌రెడ్డి నేతృత్వంతో సాగుతున్న ప్రజా చైతన్యయాత్రకు వివిధ మండలాలలో పార్టీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికి భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం చేర్యాల గాంధీ సెంటర్‌లో జరిగిన భారీ భహిరంగ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజలను కష్టాలనుండి విముక్తి చేసేది కేవలం ఎర్రఎండాతోనే సాధ్యమని అన్నారు. కేంద్రరాష్ట్రా ప్రభుత్వాలు ఎన్నికల హామీలను అమలు చేసేంత వరకు ప్రజల్లో చైతన్యం కల్పించి ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో ఉద్యోగావకాశాలు కల్పించి, నిరుద్యోగాన్ని అంతం చేసినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వాలు యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, ఎన్నిక సమయాల్లో యువతకు ఆశలు కల్పించి, అధికారంలోకి వచ్చాక హామీలను తంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. దీంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారి ఆత్మహత్యలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఖాళీగాఉన్న అన్ని శాఖల ఉద్యోగాలను వేంటనే భర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు తాండ్ర సదానందం, గడిపె మల్లేశ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments