HomeNewsBreaking Newsమన వ్యవసాయరంగందేశానికి దిక్సూచి

మన వ్యవసాయరంగందేశానికి దిక్సూచి

దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కెసిఆర్‌దే
వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కె.తారకరామారావు
ప్రజాపక్షం/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి
తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశ దిశ చూపుతోందని, కొంత మంది దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో బుధవారం వ్యవసాయ కళాశాలను రాష్ట్ర మంత్రి నిరంజన్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. కళాశాలలో వివిధ విభాగాలు, వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామన్నారు. దేశానికే దిశానిర్దేశం చేసే వ్యవసాయ శాస్త్రవేత్తలుగా జిల్లెల్ల కళాశాలలోని విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశ దిశ చూపుతోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కొందరు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డా రు. వారు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమానికి హెలికాప్టర్‌లో వస్తున్నప్పు డు.. వరుసగా ఉన్న కొండ పోచమ్మ సాగర్‌, మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌, అన్నపూర్ణ రిజర్వాయర్‌, మిడ్‌ మానేరులో నీళ్లు నిండి కళకళలాడుతుంటే ఎంతో సంబురంగా అనిపించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్‌ లేదన్నారు. తెలంగాణలో కొత్తగా చేపట్టిన రిజర్వాయర్‌ల ద్వారా భూగర్భజల మట్టం పెరిగి కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని అన్నారు. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సాటిలైట్‌ క్యాంపస్‌ మంజూరుతో పాటు వ్యవసాయ కళాశాలను పిజి కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ కోరగా, సిఎం కెసిఆర్‌ అనుమతితో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కళాశాలగా నామకరణం చేయాలన్నారు. రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సదుపాయాలు, అధునాతన సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా నిలుస్తుందన్నారు. తమ నియోజకవర్గాలలో 47 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే ఎక్కువగా సిరిసిల్లను ఈ తొమ్మిదేళ్లలో కెటిఆర్‌ అభివృద్ధి చేశారని ప్రశంసించారు. స్వరాష్ట్రం తెలంగాణలో ఇన్ని రిజర్వాయర్లు వస్తాయని ఎవరైనా సమైక్య రాష్ట్రంలో ఊహించారా ? అని సభాపతి ప్రజలను ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యమే కరువు ప్రాంతాలలో ప్రజలకు ఆహారంగా పంపిణీ అవుతుండడం మనందరికీ గర్వకారణం అన్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర సహా పొరుగున ఉన్న రాష్ట్రాల ప్రజలు కొనియాడుతున్నారని, తమ రాష్ట్రాలలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలని ఆ ప్రభుత్వాలను ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వసతులు, సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కళాశాల రావడం ఈ ప్రాంత విద్యార్థులకు అదృష్టమని మంత్రి చెప్పారు. సమైక్య రాష్ట్రంలో భూములు కలిగి ఉన్న ప్రజలు సాగు జలాల లభ్యత లేక ధాన్యం గింజల కోసం ప్రభుత్వ రేషన్‌ కోసం క్యూ లైన్లులో నిలబడే దుస్థితి ఉండేదన్నారు. భూగర్భ జలమట్టం పెరగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముస్సోలిలోని శిక్షణ ఐఎఎస్‌లకు పాఠంగా మారడం గర్వకారణమన్నారు. సగానికి పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కేవలం 700 లోపే వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. పాధాన్యతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేస్తుందన్నారు. స్వరాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయిన్‌ పల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ 20 ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకోకపోతే జిల్లాలో ఈ కళాశాల ఉండేదా అని ప్రజలను ప్రశ్నించారు. అమెరికా స్థాయిలో తెలంగాణలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ అభివృద్ధికి ఊతమిచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. వేములవాడ ఎంఎల్‌ఎ డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు మాట్లాడుతూ ఈ గడ్డపై కళాశాల వస్తుందని ఎవరు ఊహించలేదని, తెలంగాణ అమరులకు ఇది సరైన నివాళి అన్నారు. ప్రస్తుతం ఆహార భద్రత స్థానంలో పౌష్టికాహార భద్రత వచ్చిన దృష్ట్యా పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పౌష్టికాహార భద్రతకు దోహదం చేస్తున్నాయన్నారు. పౌష్టికాహార భద్రతపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాంసృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌, ఎంఎల్‌ఎలు సుంకే రవిశంకర్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ప్రొఫసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇంచార్జీ వైస్‌ ఛాన్సలర్‌ రఘునందన్‌రావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌బాబు, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్‌, ఎన్‌ ఖీమ్యా నాయక్‌, రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌ రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌లు జిందం చక్రపాణి, రామతీర్థపు మాధవి, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments