బండి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్
10వ తరగతి పేపర్ లీకేజీపై ఎఐఎస్‌ఎఫ్ నిరసన దీక్ష
ప్రజాపక్షం/హైదరాబాద్ పదవ తరగతి పేపర్ లీకేజీలో ఎ-1గా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై న్యాయ విచారణ జరిపి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. 30 లక్షల మంది అభ్యర్థులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వారికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలని, టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, 10వ తరగతి పేపర్ లీకేజీలో ఎ-1 గా ఉన్న బండి సంజయ్ పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష కు కూనంనేని సాంబశివరావు ప్రారంభించి, వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మతోన్మాద బిజెపి అధికారంలో వచ్చేందుకు అనేక రాష్ట్రాల్లో రాజ్యాంగా న్ని తుంగలో తొక్కి, అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకుందని విమర్శించారు. ఆ రాక్షస క్రీడలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, విద్యార్థి, నిరుద్యోగుల్లో ఉన్న నిస్సహాయతను ఆసరా చేసుకుని రాజకీయాలు చేస్తోందని కూనంనేని ఆరోపించారు. అలాగే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించాలని, టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో ముందు రోజు తెలుగు, తరువాత రోజు హిందీ పేపర్ లీక్ అయిందని,ఈ మొత్తం వ్యవహారంలో ముందుగానే బండి సంజయ్ వారం రోజుల పాటు పార్టీ సభ్యులైన ప్రశాంత్, ఇతరులను లీకేజీ చేసేలా ప్రేరేపించి ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా నిస్సిగ్గుగా, పోలీసులకు సహకరించకుండా, సెల్‌ఫోన్ ఇవ్వకుండా దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేస్తూ, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని కూనంనేని ఆరోపించారు. ఎఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు శువం బెనర్జీ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు విద్యావ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేపర్ లీకేజీల పట్ల చాలా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని, దేశంలో బిజెపి పాలక ప్రభుత్వాలు అయిన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో అనేక పరీక్ష పేపర్ లీకేజీలు అయ్యాయని, తెలంగాణలో బిఆర్‌ఎస్ పేపర్ లీకేజీల రాజకీయ లబ్ధి ప్రయోజనం పొందాలని చూడటం సిగ్గుచేటని, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండాలని, వారికి భరోసా కల్పించాలని శువం బెనర్జీ డిమాండ్ చేశారు.
దీక్షకు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి మద్దతు
దీక్షకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ, చాడ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్య కాషాయీకరణ, కార్పోరేటీకరణకు దోహదం చేసే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు అని, వారి జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడటం దారుణమన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, నాగరాజు,డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్,ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ , పిడిఎస్‌యు(వి) రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, పిడిస్‌యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ,పిడిఎస్‌యు (విజృంభణ)రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి శ్రీకాంత్, మహేష్ ,ఎఐఎస్‌ఎబి రాష్ట్ర కార్యదర్శి గవ్వ వంశిధర్ రెడ్డి , వైఎస్‌ఆర్‌టిపి విద్యార్థి విభాగం నాయకులు శివ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ దీక్షలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్,రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రెహమాన్, నాగ జ్యోతి రఘురాం, గ్యార క్రాంతి, సోతుకు ప్రవీణ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాషబోయిన సంతోష్, శివ, శరత్, ప్రేమ్ అన్వర్, ప్రేమ్, ప్రసన్న, నాయకులు చినబాబు హరీష్, సందీప్, రవితేజ తదితరులు పాల్గొన్నారు
సంజయ్‌పై న్యాయ విచారణ
RELATED ARTICLES