రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖమంత్రి కెటిఆర్ ప్రకటన
ప్రజాపక్షం/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి తెలంగాణ గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి, సిడిపి గ్రాంట్‌ల కింద కోటి రూపాయలలోపు ఉన్న బకాయిలు రూ. 1300 కోట్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటి, భారీ పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ఈ విషయంపై ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడానన్నారు. సోమవారం నిర్వహించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్‌లో భాగంగా జాతీయ పంచాయతీ అవార్డ్ -2023 కార్యక్రమంలో 9 కేటగిరీల్లో మొదటి మూడు స్థానాల్లో ఉత్తమంగా నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచులకు మంత్రి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా పనిచేస్తే ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో రావాల్సిన రూ. 1200 కోట్ల రూపాయల బకాయిలను రాకుండా చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం కేటాయింపులను తగ్గిస్తుందని చెప్పారు. పల్లెప్రగతి కార్యక్రమంతో దేశానికే దిక్సూచిగా తెలంగాణ పల్లెలు వెలుగొందుతున్నాయన్నారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చి గ్రామ పంచాయతీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు పెద్దపీట వేశామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. సర్పంచులు, అధికారులు సమష్టిగా కృషిచేయడం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే… అందులో 19 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం గర్వకారణమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్‌కు రెండు సార్లు ఉత్తమ జెడ్‌పిగా అవార్డుకు ఎంపికైందన్నారు. 25 గ్రామపంచాయతీలు 13 మండలాలు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వరుసగా మూడుసార్లు ఫోర్ స్టార్ రేటింతో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాను గ్రామీణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి.రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా, తెలంగాణ సాంసృతిక సారథి చైర్మన్, రసమయి బాలకిషన్, ఎంఎల్‌సి రమణ, సారయ్య, ఎంఎల్‌ఎలు చెన్నమనేని రమేష్ బాబు, సుంకే రవి శంకర్, అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రికి నిరసనల సెగ
మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సిరిసిల్లలో నిరసనల సెగ తగిలింది. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన క్రమంలో పలువురు ఎబివిపి నాయకులు మంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టిఎస్‌పిఎస్‌సి పరీక్ష లీకేజీల విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కెటిఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరై తిరిగి వస్తుండగా ఎబివిపి కార్యకర్తలు అకస్మికంగా మంత్రి కారును అడ్డగించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్యకర్తలను లాక్కెళ్ళడంతో పరిస్థితి సద్దుమణిగింది. బిఆర్‌ఎస్ కంచుకోటలో మంత్రి కెటిఆర్‌ను అడ్డుకోవడం చర్చ నియాంశంగా మారింది.
ఈ నెలాఖరులోపు పంచాయతీలకు రూ. 1300 కోట్లు విడుదల
RELATED ARTICLES